
అమ్రాబాద్: నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు నల్లమల అటవీ ప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. పదర ఎస్‌ఐ సురేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లికి చెందిన శ్రీనివాసులు, పద్మ దంపతుల కుమార్తె శమంత (27), అదే గ్రామానికి చెందిన అయ్యన్న, లింగమ్మ దంపతుల కుమారుడు సురేశ్(28) ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఎనిమిదేళ్ల క్రితం శమంతకు సికింద్రాబాద్‌కు చెందిన సతీష్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన శమంత జూన్ 24న నాలుగేళ్ల చిన్న కుమారుడిని తీసుకుని సురేశ్‌తో వెళ్లిపోయింది.
దీంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడ కేసు నమోదైన నేపథ్యంలో శనివారం తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని సురేశ్, శమంత తమ కుటుంబసభ్యులు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు పోలీసులు సహాయంతో సిగ్నల్స్ ఆధారంగా మద్దిమడుగు అటవీ ప్రాంతంలో వెతికారు. ఆ సమయంలో అక్కడ బాలుడి ఏడుపు శబ్ధం విని.. ఘటనస్థలానికి చేరుకున్నారు. అప్పటికే పురుగుల మందు తాగి, ఇద్దరూ విగత జీవులుగా పడి ఉన్నారు. మృతదేహాలను గుర్తించిన పోలీసులు, వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment