సాక్షి ప్రతినిధి, గుంటూరు: పోలీసు డిపార్టుమెంట్‌లో జరిగిన ఈ–చలానా కుంభకోణంలో ప్రధాన నిందితుడు కొమ్మారెడ్డి అవినాష్‌ను అరెస్టు చేసినట్లు గుంటూరు రేంజ్ ఐజీ జి.పాలరాజు తెలిపారు. మంగళవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ వ్యవహారం మొత్తం 2018–19లో జరిగిందని తమ విచారణలో స్పష్టమైందన్నారు. 2018లో అప్పటి డీజీపీ సాంబశివరావు ఎటువంటి టెండర్లు లేకుండానే తొమ్మిది జిల్లాల్లో మోటారు వాహనాల చలానాల వసూళ్లను డేటా ఎవాన్ సొల్యూషన్స్‌కు అప్పగించారని, ఆ తర్వాత 2019లో కేవలం ఒక్క రూపాయికే టెండర్ వేసిన ఆ సంస్థకు కట్టబెట్టారన్నారు.
ఆడిటింగ్ జరగకుండానే టెండర్ కట్టబెట్టడంతో రూ. 36.53 కోట్లు దారి మళ్లినట్లు తమ విచారణలో తేలిందన్నారు. డేటా ఎవాన్ సొల్యూషన్స్‌తో పాటు రోజర్ పీఈ అనే సంస్థ ద్వారా అవకతవకలకు తెరలేపారన్నారు. చలానాల ద్వారా కలెక్ట్ అయిన మొత్తం డైరెక్ట్‌గా డీజీ అకౌంట్‌కు వెళ్లకుండా రేజర్‌పే ద్వారా రోజర్ పీఈకు మళ్లినట్లు గుర్తించామన్నారు. ఈ విధంగా దారిమళ్లిన సొమ్ముతో అమెజాన్ క్లౌడ్ సర్వీస్‌ను కొనుగోలు చేసి దాని ద్వారా 50 నుంచి 60 సంస్థలకు సర్విసులు ఇస్తున్నారని చెప్పారు.
ఈ సర్వీసుల ద్వారా సుమారు రూ. 25 కోట్లు డేటా ఎవాన్ సొల్యూషన్ సంస్థకు రావాల్సి ఉందని, ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకు జమ చేసేలా కోర్టు ద్వారా చర్యలు చేపట్టామన్నారు. 2019 తర్వాత సుమారు 16 ఆస్తులను కొనుగోలు చేసినట్లు గుర్తించామని, వాటిని సీజ్ చేసి ఎటువంటి లావాదేవీలు జరగకుండా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
సీరియస్‌గా ప్రభుత్వం..
ప్రజల సొమ్ము ఈ విధంగా దారి మళ్లడంపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని పాలరాజు చెప్పారు. 2018 నుంచి ఇప్పటివరకూ ఎంత సొమ్ము, ఏ ఖాతాలకు మళ్లింది అనే అంశాలపై ఆడిటింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కొంత డబ్బు పలు ప్రైవేటు ఖాతాలకు మళ్లించారని, ఆ ఖాతాలను కూడా సీజ్ చేశామని చెప్పారు. మరోవైపు ఈ వ్యవహారంపై ప్రస్తుత డీజీపీ అంతర్గత విచారణకు ఆదేశించారన్నారు.
టెండర్ కట్టబెట్టడంలో ఎవరు బాధ్యులనే అంశంపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. భవిష్యత్‌లో ప్రైవేటు సంస్థల ద్వారా ఈ–చలానా వసూలు చేయకుండా, ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్‌ఐసీ ద్వారా వసూలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కేసు విషయంలో కంపెనీలోని మిగిలిన డైరెక్టర్ల పాత్రపై కూడా విచారణ జరిపి వారి తప్పు ఉంటే అరెస్టు చేస్తామని ఐజీ పాలరాజు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment