
సాక్షి, న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కలకలం ఏర్పడింది. ఓ మహిళతో పాటు ఓ వ్యక్తి బలవన్మరణానికి యత్నించారు. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మంటలతోనే కోర్టు ఆవరణలోకి ప్రవేశించారు. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది వారి మంటలు ఆర్పేసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సుప్రీంకోర్టు ప్రధాన ద్వారం గేట్ నంబర్ డీ వద్దకు సోమవారం ఉదయం ఓ మహిళ, ఓ వ్యక్తి వచ్చారు.
లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అనుమతించలేదు. ఐడీ కార్డు లేదా, ఏమైనా ధ్రువపత్రాలు ఉన్నాయా? అని అడగ్గా లేవని చెప్పడంతో సెక్యూరిటీ లోపలికి రానివ్వలేదు. దీంతో వారిద్దరూ అప్పటికప్పుడు నిప్పటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై మంటలు ఆర్పివేశారు. అనంతరం వారిని పోలీస్ వ్యాన్‌లో రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించినట్లు డీసీపీ దీపక్ యాదవ్ తెలిపారు. అయితే వారిద్దరూ ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు? అనే వివరాలు తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే బాధితులు తమకు న్యాయం జరగడం లేదనే ఆవేదనతో బలవన్మరణానికి యత్నించారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment