
ప్రముఖులతో నిందితుడు యువరాజ్ (ఫైల్)
యశవంతపుర: సర్కారీ ఉద్యోగాలను ఇప్పిస్తానని, ప్రభుత్వంలో పనులు చేయిస్తానని పలువురిని నమ్మించి భారీగా డబ్బులు గుంజిన బెంగళూరు చీటర్ యువరాజ్ అలియాస్ సేవాలాల్ సాధారణ వ్యక్తి కాదని, పెద్ద తలకాయలతో పరిచయాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంతకుముందే చీటింగ్ కేసుల్లో ఇతడు ఇరుక్కోగా బడా నాయకులు విడిపించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ పార్టీ ముఖ్య నేతలతో తీయించుకున్న ఫోటోలను అడ్డం పెట్టుకుని దందా సాగించేవాడు. బెంగళూరుకు చెందిన ఒక పారిశ్రామికవేత్తకు కేఎస్ ఆర్టీసీ అధ్యక్ష పదవిని ఇప్పిస్తానంటూ నమ్మించి కోటి రూపాయలను వసూలు చేశాడు. ఎన్నిరోజులైన పదవీ లేదు, డబ్బులు వాపస్ ఇవ్వకుపోవటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత బాధితులు ఒక్కొక్కరే బయటకు రావడంతో యువరాజ్ బాగోతం రచ్చకెక్కింది.
తన దందాలో విశ్రాంత ఎస్పీ పాపయ్యను మధ్యవర్తిగా ఉపయోగించుకున్నట్లు తెలిసింది. ఒక ఉన్నత పదవిలో ఉన్న మహిళకు గవర్నర్ పదవిని చేతిలో పెడతానని కోట్లాది రూపాయలను వసూలు చేసినట్లు ప్రచారం. పదవి రాకపోవడంతో ఆ మహిళ విల్సన్ గార్డెన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇందులో యువరాజ్, పాపయ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాపయ్య పరారీలో ఉన్నాడు. రాష్ట్రానికి చెందిన బలమైన బీజేపీ నాయకునితో కలిసి యడియూరప్పను సీఎం పదవి నుండి దించటానికి సైతం యువరాజ్ పథకం వేసినట్లు తెలిసింది. మోసం చేసి సంపాదించిన డబ్బులను నటి రాధికా కుమారస్వామితో పాటు ఇతరుల అకౌంట్‌కు బదిలీ చేసినట్లు సీసీబీ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment