ప్రతీకాత్మక చిత్రం
నోయిడా : కారును అమ్ముతూ, అమ్మిన కారును తనే దొంగిలిస్తూ చివరకు కటకటాల పాలయ్యాడో వ్యక్తి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత మార్చి నెలలో అమ్రోహాకు చెందిన మనోత్తమ్ త్యాగి అనే వ్యక్తి ఈ కామర్స్ సైట్లలో తన కారు.. మారుతీ స్విఫ్ట్ వీహెచ్‌ఐని అమ్మకానికి పెట్టాడు. ఆ ప్రకటన చూసిన జీతే యాదవ్ అనే వ్యక్తి త్యాగిని సంప్రదించాడు. 2,60,000 వేలకు బేరం కుదిరింది. అనంతరం త్యాగి తన కారును యాదవ్‌కు అప్పగించాడు. అయితే ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పేపర్లు, రెండవ తాళం చెవి తర్వాత ఇస్తానని అతనికి చెప్పాడు. యాదవ్ కూడా పూర్తిగా డబ్బు ఇవ్వకుండా 2.10లక్షలు అప్పుడే ఇచ్చి, మిగిలిన యాభై వేలు పేపరు, తాళం చెవి అప్పగించిన తర్వాత ఇస్తానన్నాడు. యాదవ్ మరుసటి రోజు కారును ఆఫీసు ముందు నిలిపి ఉంచగా త్యాగి దొంగిలించాడు. ( ఐసీయూలో ఉన్న పేషెంట్‌పై అత్యాచారం )
కారు కనిపించకపోయే సరికి యాదవ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా త్యాగిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో త్యాగి మాట్లాడుతూ..‘‘కారును అమ్మినట్లే అమ్మి, ఆ తర్వాత నేనే దాన్ని దొంగిలించేవాడ్ని. నా కారులో జీపీఎస్ బిగించాను. దాని ఆధారంగానే కారు ఎక్కడ ఉందో కనుక్కునే వాడ్ని. అలా దాదాపు ఏడుగురిని మోసం చేశాను’’ అని చెప్పాడు. అతడి వద్దనుంచి కారు, మొబైల్ పోన్లు, నకిలీ ఆధార్‌కార్డులు, పాన్‌కార్డులు, కొంత నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కోర్టులో హాజరుపరిచి, జ్యూడీషియల్ కస్టడీకి పంపారు.
Comments
Please login to add a commentAdd a comment