
కేటీదొడ్డి (గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లాలో రైతుబంధు డబ్బులు ఇవ్వనందుకు కన్నతల్లినే ఓ కొడుకు కొట్టి చంపేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. కేటీదొడ్డి మండలంలోని గువ్వలదిన్నెకు చెందిన దాసరి శాంతమ్మ (52), హన్మంతుకు ఇద్దరు కుమారులు. కొన్నేళ్ల క్రితమే భర్త ఎటో వెళ్లిపోయి ఇంతవరకు తిరిగి రాలేదు. పెద్ద కుమారుడు, కోడలు బతుకుదెరువుకోసం హైదరాబాద్ వలస వెళ్లారు. రెండో కుమారుడు వెంకటేశ్, తల్లి శాంతమ్మ స్వగ్రామంలోనే ఉంటూ తమకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే రెండో పెళ్లి చేసుకున్న వెంకటేశ్‌ను తల్లి ఇంటి నుంచి గెంటేసింది. దీంతో వేరే కాపురం పెట్టిన అతను మద్యానికి బానిసై తరచూ డబ్బుల కోసం తల్లిని వేధించేవాడు.
రెండు రోజుల క్రితమే ‘రైతుబంధు’డబ్బులు వచ్చాయని తెలుసుకున్న వెంకటేశ్ మంగళవారం అర్ధరాత్రి తల్లి వద్దకు వచ్చి గొడవపడ్డాడు. డబ్బులు ఇవ్వాలని అడగ్గా అమె నిరాకరించడంతో అంతు చూస్తానని చెప్పి కర్రతో తలపై కొట్టాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బుధవారం ఉదయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ యాదగిరి, ఎస్‌ఐ కుర్మయ్య పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment