వేలేరుపాడు(పశ్చిమ గోదావరి): ప్రపంచం అన్ని రంగాల్లో శరవేగంగా ముందుకు దూసుకుపోతున్నా.. గిరిజన ప్రాంతాల్లో మాత్రం మూఢనమ్మకాలు తొలగిపోవడం లేదు. అందుకు ఉదాహరణే వేలేరుపాడు మండలంలోని కొర్రాజులగూడెంలో గ్రామంలో జరిగిన కారం రాజులు(57) హత్య. చేతబడి అనుమానంతో గ్రామానికి చెందిన కొందరు అతనిని హత్య చేయగా ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొర్రాజులగూడెంకు చెందిన నూపా లక్ష్మయ్య ఆగస్టు నెలలో అనారోగ్యంతో మృతి చెందాడు.
తన భర్త మృతికి కారం రాజులు చేతబడే కారణమని, భార్య నూపా దుర్గమ్మ భావించింది. రాజులపై ప్రతీకారం తీర్చుకోవాలని పథకం వేసింది. వరుసకు కొడుకయ్యే నూపా పెంటయ్య, కొడుకు వంశీతో కలిసి హత్యకు స్కెచ్ వేసింది. ఈ నెల 17న రాత్రి గ్రామంలోని పొలంలో ఉన్న రాజులు వద్దకు పెంటయ్యను పంపింది. పెంటయ్య, రాజులు కలిసి అతిగా మద్యం సేవించారు. రాజులు మత్తులోకి జారుకున్నాక దుర్గమ్మ, పెంటయ్య, వంశీ అక్కడికి వచ్చారు.
ముందుగా రాజులు తలపై కొట్టి, మొఖంపై గట్టిగా మోదారు. దీంతో రాజులు మృతి చెందాడు. ఈ విషయం 19న వెలుగులోకి వచ్చింది. అదే రోజున గ్రామస్తులు, దహన సంస్కారాలు కూడా చేశారు. ఆనంతరం కూతురు కారం రజిని 23న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును పోలీసులు నాలుగు రోజుల్లోనే ఛేదించారు. శుక్రవారం నిందితులైన దుర్గమ్మ, పెంటయ్యను అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.
చదవండి: భర్తతో విడాకులు, మరో వ్యక్తితో ప్రేమ, ప్రియుడు నిర్లక్ష్యం చేస్తున్నాడని
Comments
Please login to add a commentAdd a comment