అమీర్‌పేట: ఆడపిల్లలు పుట్టారని భర్త వేధిస్తుండటంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా పెద్ద అరిశర్లపల్లి మండలం నార్ల తండాకు చెందిన రమావత్ లింగం పెద్ద కుమార్తె వి.అనిత (25)ను 2015లో రేగులవర తండా మాచర్లకు చెందిన బాబూరావుకు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు.
రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి బోరబండ ఇంద్రానగర్ ఫేస్–2లో నివాసముంటున్నారు. బాబూరావు కూలీ పనిచేయగా వచ్చిన డబ్బుతో రోజూ మద్యం తాగి వచ్చి భార్యను కొట్టేవాడు. శనివారం సాయంత్రం 5 గంటలకు అనిత తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారని రోజూ తాగి వచ్చి భర్త కొడుతున్నాడని చెప్పగా, వారు కూతురికి సర్ధిచెప్పారు. కొద్ది సేపటి తర్వాత తల్లి ఫోన్ చేయగా అనిత తీయలేదు.
అల్లుడు బాబూరావుకు ఫోన్ చేస్తే అతను కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇదిలా ఉండగా, ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు బంధువులు రవీందర్, హన్మంత్ అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. అల్లుడి వేధింపుల కారణంగానే అనిత ఆత్మహత్య చేసుకుందని, విచారణ జరిపి అతడిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని లింగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ప్రేమ వేధింపులు: అల్లుడిని హత్య చేసిన మామ
Comments
Please login to add a commentAdd a comment