పిఠాపురం(తూర్పుగోదావరి): క్షణికావేశం ఎంత దారుణ పరిస్థితులకు దారి తీస్తుందో ఈ ఘటనే ఉదాహరణ. 30 ఏళ్లకు పైగా దాంపత్య జీవితం గడిపిన ఆ భర్త కేవలం తాను తెచ్చిన కూర వండనందుకు భార్యపై కోపంతో మనస్తాపానికి గురై తన జీవితాన్నే అంతం చేసుకున్నాడు. ఏకంగా ప్రాణాలే తీసుకోవడం ఆ కుటుంబం మొత్తాన్ని శోకసంద్రంలో ముంచేసింది. శనివారం రాత్రి ఈ ఘటన గొల్లప్రోలు మండలం కొడవలిలో చోటు చేసుకుంది. గొల్లప్రోలు పోలీసుల కథనం ప్రకారం.. కొడవలికి చెందిన సీహెచ్ త్రిమూర్తులు (50) రైతు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
శనివారం సాయంత్రం మార్కెట్‌కు వెళ్లి చికెన్, మటన్ తీసుకొచ్చాడు. రెండు కూరలూ వండాలని భార్యకు చెప్పాడు. ఇప్పుడు ఒకటి.. మరొకటి రేపు ఆదివారం కాబట్టి వండుతానని భార్య చెప్పగా కోపోద్రిక్తుడయ్యాడు. తన మాట వినలేదంటూ వివాదానికి దిగి బయటకు వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు వెంటనే అతనిని ప్రత్తిపాడు పీహెచ్‌సీకి తీసుకెళ్లగా ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను ఆదివారం ఉదయం మృతి చెందినట్లు గొల్లప్రోలు ఎస్సై రామలింగేశ్వరరావు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి:
హఠాత్తుగా గోనెసంచిలో నుంచి లేచి..
ఇండియా బుక్‌లోకి ‘ఎన్నికల వీరుడు’
Comments
Please login to add a commentAdd a comment