కొంచాడ వెంకటరమణ (ఫైల్)
కాశీబుగ్గ: పది నిమిషాల్లో ఇంటికి వస్తానని భార్యకు ఫోన్ చేసిన కొద్దిసేపటికే రోడ్డు ప్రమాదంలో భర్త తనువుచాలించాడు. ఈ విషాదఘటన జాతీయ రహదారిపై నెమలినారాయణపురం వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకోగా.. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి రాజాం కాలనీకి చెందిన కొంచాడ వెంకటరమణ (49)ను లారీ ఢీకొట్టడంతో మృత్యువాత పడ్డాడు. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు.. వెంకటరమణ కాశీబుగ్గలోని బీఎస్‌ఎన్‌ఎల్ ఎక్సే్ఛంజ్ ఎదురుగా కిరాణా దుకాణం నిర్వహిస్తుంటారు. ఇతని వద్ద గ్రామాల్లోని దుకాణదారులు సరుకులు తీసుకెళ్తుంటారు. (చదవండి: బరితెగించిన హిజ్రాలు.. బైక్‌పై వెళ్తున్న దంపతులను అడ్డగించి.. )
తరువాత వెంకటరమణ వెళ్లి డబ్బులను వసూలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే బుధవారం కూడా డబ్బులు వసూలు చేయడానికి మందస మండలానికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరిగి వస్తూ మార్గమధ్యంలో నుంచి భార్య మాధవికి ఫోన్ చేసి మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటానని తెలియజేశారు. ఇంతలో నెమలినారాయణపురం వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహంనపై వెళ్తున్న అతన్ని లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడకక్కడే దుర్మరణం పాలయ్యారు. సమాచారం తెలుసుకున్న భార్య మాధవి, ఇద్దరు కుమారులు, బంధువులు చేరుకొని గుండెలవిసేలా రోదించారు. నన్ను ఒంటరి చేసి వెళ్లిపోతావా.. తనను కూడా తీసుకెళ్లిపోవా అంటూ భార్య రోదించిన తీరు అక్కడ ఉన్నవారిని కలచి వేసింది. కాశీబుగ్గ ఎస్సై మధు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన లారీని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.
కళ్లను దానం చేసిన కుటుంబ సభ్యులు
వెంకటరమణ సత్యసాయి భక్తుడు. ఆపదలో ఉన్నవారికి సాయం చేసి ఆదుకునేవారు. ఇప్పటివరకూ 35 సార్లు కష్టాల్లో ఉన్నవారికి రక్తం అందించి అండగా నిలిచాడు. తాను మరణిస్తే కళ్లను దానం చేయాలని కుటుంబీకులకు చెబుతుండేవాడు. అతని కోరిక మేరకు ఇండియన్ రెడ్‌క్రాస్ వారికి కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. దీంతో శ్రీకాకుళం నుంచి వచ్చిన సిబ్బంది వెంకటరమణ నేత్రాలను సేకరించి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment