గుంటూరు: నాలుగు రోజుల కిందట మైనర్‌ను ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలిక కుటుంబసభ్యులు, బంధువులు దాడి చేసి వేధించినందుకే ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణ పినపాడుకు చెందిన అడపాక శ్రీరామ్(18) ఓ వాటర్ ప్లాంట్‌లో ఆటో డ్రైవర్/డెలివరీ బాయ్‌గా పనిచేస్తుండే వాడు. పట్టణ మారీసుపేటలోని ఎన్‌సీఆర్‌ఎన్‌ఎం హైస్కూలుకు వాటర్ క్యాన్‌లను వేసేందుకు గతేడాది వెళ్లేప్పుడు అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికతో పరిచయం ఏర్పడింది. ఈ విషయం ఇరువురి కుటుంబాలకు తెలియడంతో ఇద్దరినీ మందలించారు.
నాలుగు రోజుల కిందట బాలికతో కలసి విజయవాడ వెళ్లి, దుర్గమ్మ ఆలయంలో వివాహం చేసుకున్నాడు. అక్కడ నుండి బంధువుల ఇంటికి వెళ్లగా, ఇరువురు కుటుంబసభ్యులకు తెలిసి, మూడేళ్ల అనంతరం పెళ్లి చేస్తామని చెప్పి వారిని ఎవరి ఇళ్లకు వాళ్లను తీసుకెళ్లిపోయారు. జరిగిన ఉదంతం గురించి మాట్లాడుకుందామని బాలిక తరఫువారు శ్రీరామ్‌ను ఆదివారం రాత్రి పిలిపించారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
కొన ఊపిరితో ఉన్న అతన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించగా, వైద్యులు చికిత్స అందిచే క్రమంలో మృతి చెందాడు. తమ కుమారుడిపై బాలిక కుటుంబసభ్యులు, బంధువులు దాడి చేసి దూషించడంతోనే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి తల్లి ఆరోపిస్తోంది. ఆమె ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ ఎస్‌ఐ ఎం.విజయ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment