నాగర్‌కర్నూల్ క్రైం: ఆలనాపాలనా చూడాల్సిన తండ్రే.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని కన్న కొడుకులను కడతేర్చేందుకు ప్రయత్నించాడు. నిద్రపోతున్న ఇద్దరు కుమారుల మణికట్టు కోయగా.. ఓ కుమారుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా మంతటిలో గురువారం తెల్లవారుజామున జరిగింది. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ మండలం మంతటికి చెందిన శివశంకర్ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి గడ్డంపల్లికి చెందిన స్వప్నతో ఎనిమిదేళ్ల కింద వివాహం కాగా, మల్లికార్జున్ (7), ప్రణయ్ ఇద్దరు కుమారులు ఉన్నారు.
శివశంకర్ మద్యానికి బానిస కావడంతో పాటు వివాహేతర సంబంధానికి అలవాటుపడటంతో స్వప్న 3 నెలల కింద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న కొడుకులను శివశంకర్ అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న ఇద్దరి కుమారుల కుడిచేతి మణికట్టును కత్తితో కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం తాను చనిపోతున్నానంటూ తండ్రి పుల్లయ్యకు ఫోన్‌చేసి చెప్పగా.. వెంటనే వారు పక్క గదిలోకి వెళ్లి చూశారు.
అప్పటికే మల్లికార్జున్ మృతి చెంది ఉన్నాడు. గాయపడిన ప్రణయ్‌ను హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చారు. గ్రామంలో చెరువుకట్ట వద్ద శివశంకర్‌ను గుర్తించిన గ్రామస్తులు ఇంటికి తీసుకొచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని ఇన్‌చార్జి సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐలు విజయ్‌కుమార్, రాజులు పరిశీలించి వివరాలు తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
( చదవండి: బెంగళూరులో హత్య, హైదరాబాద్‌లో గాలింపు! )
Comments
Please login to add a commentAdd a comment