
కొలిమిగుండ్ల/ తాడిపత్రి రూరల్: త్వరలో పెళ్లి కావాల్సిన యువకుడు.. సరదాగా ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన ఆదివారం కర్నూలు జిల్లాలోని లొక్కి గుండం జలపాతం వద్ద చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన అఖిల్‌సాయి (21)కి కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తుమ్మలపెంటకు చెందిన అమ్మాయితో మూడు రోజుల కిందట నిశ్చితార్థం జరిగింది. నాగుల చవితి ముహూర్తాలకు వివాహం చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి.
అఖిల్‌సాయి అత్తగారి ఊరుకు వచ్చి యువతితో పాటు మరో ఇద్దరితో కలసి లొక్కిగుండంలో ఈతకు వెళ్లారు. అక్కడ ఈత కొడుతూ అఖిల్‌సాయి గుండంలో చిక్కుకుపోయి గల్లంతయ్యాడు. ఎంత సేపటికీ బయటకు రాక పోవడంతో అమ్మాయి.. కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చింది. వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. చీకటి కావడంతో లైట్లు, తాళ్ల సాయంతో వెతికి తొమ్మిది గంటల సమయంలో మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment