
సాక్షి, భావనగర్ : కంపెనీ బోర్డు మీటింగ్ లోనే షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. కంపెనీ బోర్డునుంచి తొలగించారన్న అక్కసుతో సొంత తమ్ముడిపైనే దాడికి దిగాడు. తండ్రి, ఇతర బోర్డు సమక్షంలోనే సోదరుడుపై కత్తితో దాడిచేసిన వైనం కలకలం రేపింది. భావనగర్‌లోని వర్తే గ్రామంలోని సిడ్సర్ రోడ్‌లోని తాంబోలి కాస్టింగ్స్ లిమిటెడ్ (టిసిఎల్)వద్ద ఈ సంఘటన జరిగింది. బాధితుడు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
గుజరాత్‌లో తంబోలి కాస్టింగ్స్ లిమిటెడ్ (టీసీఎల్) డైరెక్టర్లలో ఒకడైన మెహుల్ తంబోలిని తొలగించాలని కంపెనీ బోర్డు తీర్మానాన్ని ఆమోదించింది. స్వయంగా తండ్రి బిపిన్ తంబోలి (77) అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సస్పెన్షన్‌పై ఆగ్రహించిన మెహుల్ తమ్ముడు వైభవ్‌ను కత్తితో పొడిచి పొత్తికడుపులో పారిపోయాడు.వెంటనే బాధితుడు వైభవ్‌ను ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడు మొహుల్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతనికోసం గాలిస్తున్నారు.
2004లో ఏర్పాటైన టీసీఎల్ బీఎస్ఇ లిస్టెడ్ సంస్థ. ఫెరారీ, ఫియట్, ఫోర్డ్, జనరల్ మోటార్స్, జాగ్వార్, జాన్ డీర్ వంటి ఆటోమోటివ్ కంపెనీలకు విడి భాగాలను సరఫరా చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్‌గా బిపిన్ తంబోలి ఉండగా, పిఎ సుబ్రమణియన్ వైస్ చైర్మన్‌గా, అన్నదమ్ములు మెహుల్, వైభవ్ ఇద్దరూ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే ఈ వివాదానికి గల కారణాలు, మెహుల్ ను ఎందుకు తొలగించారు తదితర వివరాలు వెలుగులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment