కనుముక్కల ఆదాం (ఫైల్)
సాక్షి, పుట్టపర్తి అర్బన్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక పుట్టపర్తి మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడు కనుముక్కల ఆదాం (49) ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. పుట్టపర్తికి చెందిన కనుముక్కల ఆదాం.. టైలరింగ్‌తో పాటు ఓ చిన్న గదిలో చీరల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. భార్య మహబూబ్‌బీ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఐదేళ్ల క్రితమే కుమార్తెకు వివాహం చేశారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబం.. కరోనా లాక్‌డౌన్ సమయంలో వ్యాపారం బోసిపోయి కుదేలైంది.
ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. బుధవారం తెల్లవారుజామున వాకింగ్ ముగించుకుని ఇంటికి చేరుకున్న ఆదాం.. తర్వాత ద్విచక్ర వాహనంలో పుట్టపర్తి మండలం ప్రశాంతి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్ ఎదుట ద్విచక్ర వాహనాన్ని నిలిపి కొత్త చెరువు వైపుగా పట్టాలపై నడుచుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. సుమారు ఓ కిలోమీటరు వెళ్లిన తర్వాత సెల్ఫీ వీడియో ముగించి ఎదురుగా వస్తున్న గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై హిందూపురం రైల్వే ఎస్‌ఐ బాలాజీ నాయక్ కేసు నమోదు చేశారు.
సల్మా.. నన్ను క్షమించు!
ఆత్మహత్యకు ముందు తన చావుకు ఎవరూ కారణం కాదంటూ ఆదాం సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ‘సల్మా! (కుమార్తె) నన్ను క్షమించు. మీకు ఏమీ చేయలేకపోయాను. నన్ను క్షమించండి. నా చావుకు ఎవరూ కారణం కాదు. నా చావు తర్వాత కుటుంబసభ్యులను, మిత్రులను ఎవరినీ పోలీసులు ఇబ్బందులు పెట్టొద్దు. నా చావుకు పూర్తి బాధ్యత నాదే. అందరికీ సలాం!’ అంటూ సందేశమిచ్చారు. అనంతరం ఈ వీడియోను పుట్టపర్తిలోని వాల్మీకి గ్రూపులోకి షేర్ చేశారు.
పార్టీలోకి చేరగానే సముచిత స్థానం..
టీడీపీలో క్రియాశీలక నేతగా ఉన్న ఆదాం.. ఆ పార్టీలో ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో మున్సిపల్ ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఆ సమయంలో ఆయనను అన్ని విధాలుగా ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ప్రోత్సహిస్తూ వచ్చారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆదాంకు కో–ఆప్షన్ సభ్యుడిగా సముచిత స్థానం దక్కేలా చేశారు. ఆదాం మృతి చెందిన విషయం తెలుసుకోగానే ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పార్టీ సీనియర్ నాయకులు కొండారెడ్డి, లోచర్ల విజయభాస్కరరెడ్డి, నెడ్‌క్యాప్ డైరెక్టర్ మాధవరెడ్డి, మండల కన్వీనర్ గంగాద్రి, వైస్ చైర్మన్ తిప్పన్న, కౌన్సిలర్లు చెరువు భాస్కరరెడ్డి, సూర్యగౌడ్, మాజీ కౌన్సిలర్లు నారాయణరెడ్డి, నాగిరెడ్డి, రంగారెడ్డి, నాగిరెడ్డి తదితరులు ఆదాం కుటుంబసభ్యులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment