తాడేపల్లిరూరల్: అపహరించిన సెల్‌ఫోన్లు ఓఎల్‌ఎక్స్ ద్వారా విక్రయించేందుకు ప్రయత్నించి చివరకు పోలీసులకు చిక్కిన వైనం. తాడేపల్లి రూరల్ పరిధిలోని అమరావతి కరకట్ట వెంబడి కృష్ణానది ఒడ్డున స్నానాలు ఆచరించే విద్యార్థులు వారి సెల్‌ఫోన్లు భద్రపరచిన బ్యాగ్ పోవడంతో తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి పట్టుకున్నారు. గురువారం తాడేపల్లి సీఐలు శేషగిరిరావు, సాంబశివరావులు వివరాలు వెల్లడించారు. గుంటూరు కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న 23 మంది విద్యార్థులు ఈనెల 7వ తేదీన తాడేపల్లి రూరల్ పరిధిలోని అమరావతి కరకట్ట వెంబడి గంగరాజు గెస్ట్‌హౌస్ సమీపంలో స్నానాలు ఆచరించేందుకు విచ్చేశారు. ఆ సమయంలో 23 మంది విద్యార్థులు తమ వద్ద ఉన్న 24 సెల్‌ఫోన్లను ఓ బ్యాగ్‌లో భద్రపరచి ఒడ్డున పెట్టారు.
వారు స్నానం చేసి బయటకు వచ్చి చూడగా ఫోన్లు కనిపించలేదు. అదేరోజు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ రమేష్ కేసు నమోదు చేశారు. అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సూచన మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఓ.ఎల్.ఎక్స్‌లో ఫోన్‌లు అమ్ముతున్నారని సమాచారం రాగా, ఫోన్లు అమ్ముతున్న విజయనగరం జిల్లా, గూర్ల మండలం, గూడెం గ్రామానికి చెందిన కనకం దామోదరంను సంప్రదించారు. నగదును చెల్లించగా అతను సెల్‌ఫోన్‌లు తీసుకుని సీతానగరం పుష్కర ఘాట్‌కు వచ్చాడు. అతని వద్ద 22 సెల్‌ఫోన్లు ఉన్నాయని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. 22 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సెల్‌ఫోన్ దొంగతనాల కేసులు ఉన్నాయని, విజయనగరం పోలీసులు కోర్టుకు తీసుకు వెళుతుండగా పరారయ్యాడని పోలీసులు తెలిపారు. కేసులో ప్రతిభ కనబర్చిన ఎస్‌ఐలు రమేష్, వినోద్, సిబ్బంది శివకృష్ణ, బాబూరావు, విష్ణు, కళ్యాణ్, ఐటీ ఫోర్స్ సిబ్బందికి అర్బన్ ఎస్పీ అభినందనలు తెలిపారు.
చదివింది ఇంటర్.... టెక్నాలజీలో మాత్రం అదుర్స్
విజయనగరం జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన కనకం దామోదరం ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఏర్పడడంతో ఇద్దరూ విడిపోయారు. దామోదరం చదువు మానేశాడు. హాస్టల్స్, కాలేజీల వద్ద మకాం వేసి విద్యార్థులతో స్నేహం చేసి వారి వద్ద సెల్‌ఫోన్లు దొంగిలిస్తాడు. వాటిని ఓ.ఎల్.ఎక్స్‌లో పెట్టి అమ్మి సొమ్ము చేసుకుంటాడు. ల్యాప్‌టాప్ ఉపయోగించి తను దొంగిలించిన సెల్‌ఫోన్లు దానికి కనెక్ట్ చేసి సెకన్లలో లాక్ తీయడాన్ని పోలీసులు గమనించి ఆశ్చర్యానికి గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment