మార్టూరు ప్రభుత్వాస్పత్రిలో బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్న ఎస్సై శివకుమార్, సిబ్బంది- దాడి అనంతరం చేతిలో కత్తితో ఉన్న సులేమాన్‌ను ఇంటికి తీసుకెళ్తున్న భార్య
మార్టూరు(ప్రకాశం జిల్లా): క్షుద్రపూజల ఘటనలో నిందితుడు బాధితులపై మటన్ కత్తితో దాడి చేయడం మార్టూరులో తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో బాధితుల్లో ఒకరు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో కోమా స్థితిలో చికిత్స పొందుతుండగా.. మరో మహిళ చేతి వేళ్లు తెగిపడ్డాయి. ఈ సంఘటన మార్టూరు గొట్టిపాటి హనుమంతరావు కాలనీలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, కాలనీవాసుల వివరాల మేరకు కాలనీకి చెందిన పఠాన్ ఖాశీంవలి ఇంటి ముందు శుక్రవారం రాత్రి పఠాన్ సులేమాన్ కుటుంబం క్షుద్రపూజలు నిర్వహించారని బాధితుల ఆరోపణ. దీంతో సులేమాన్ కుటుంబంపై ఖాశీంవలి కుటుంబం అదే రోజు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమపై ఫిర్యాదు చేశారనే కక్షతో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో సులేమాన్ మటన్ కత్తితో ఖాశీంవలి తలపై నరికే ప్రయత్నం చేశాడు.
ఆ సమయంలో ఖాశీంవలి తల్లి కరీమూన్ తన కుమారుడి తలపై చేతులు అడ్డుపెట్టడంతో ఆమె ఎడమ చేతి రెండు వేళ్లు తెగిపోయాయి. కత్తి దెబ్బకు అపస్మారక స్థితికి చేరుకున్న ఖాశీంవలి, కరీమూన్‌ను మొదట మార్టూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఖాశీంవలి కోమాలో ఉన్నాడని, కరీమూన్ ఎడమ చేతి చూపుడు వేలును వైద్యులు తొలగించినట్లు బంధువుల సమాచారం. సులేమాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మార్టూరు ప్రభుత్వాస్పత్రి వద్దకు తీసుకురాగా పోలీసు జీపులో కూర్చుని బాధిత కుటుంబంపై మీసం తిప్పుతూ బెదిరించడం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. పోలీసులు సులేమాన్‌పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఖాశీంవలి భార్య సల్మా కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment