Adilabad Crime News Telugu: Married Women End Her Life At Adilabad District - Sakshi
Sakshi News home page

భార్య మీద అనుమానం.. పండుగపూట దారుణం

Published Wed, Mar 2 2022 1:16 PM | Last Updated on Wed, Mar 2 2022 6:21 PM

Married Women End Her Life At Adilabad District - Sakshi

నిర్మల్‌(ఆదిలాబాద్‌): మహాశివరాత్రి పండుగరోజే జిల్లాకేంద్రంలో విషాదం, ఆందోళన చోటు చేసుకున్నాయి. అనుమానాస్పదస్థితిలో వివాహిత చనిపోవడం ఉద్రిక్తతకు దారితీసింది. తనను అత్తింటివారే చంపారంటూ బాధిత కుటుంబసభ్యులు స్థానిక రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మంజులాపూర్‌కు చెందిన అరుగుల సాయికృష్ణకు ఎనిమిదేళ్ల క్రితం కుంటాల మండల కేంద్రానికి చెందిన ప్రణీత(24)తో వివాహమైంది.

వీరి ఆరేళ్ల కాపురానికి పండంటి ఇద్దరు బిడ్డలు పుట్టారు. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో అనుమానం చిచ్చుపెట్టింది. సాయికృష్ణ భార్య మీద అనుమానంతో వేధించేవాడని ప్రణీత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నాలుగు నెలల క్రితం పంచాయితీ పెట్టి ఇద్దరి మధ్య సయోధ్య కూడా కుదిర్చారు. మళ్లీ భార్యాభర్తల మధ్య గొడవ కావడంతో మంగళవారం ప్రణీత బాత్రూంలో షవర్‌కు ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.

అత్తింటి వారే చంపారని..
ప్రణీత మృతి విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు కుంటాల నుంచి వచ్చారు. భర్త, అత్తలే చంపారని ఆరోపించారు. వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు. ఎస్సై వినయ్‌కుమార్‌ వారితో చర్చించి, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. ప్రణీత అన్న ప్రవీణ్‌ ఫిర్యాదు మేరకు భర్త సాయికృష్ణ, అత్త లక్ష్మిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. తల్లి చనిపోవడం, తండ్రిపై కేసు కావడంతో 6, 4ఏళ్లు వయసున్న ఇద్దరు ఆడబిడ్డలు ఏడుస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement