బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో మాజీ పోలీసు జరిపిన కాల్పులతో శిశు సంరక్షణాలయం రక్తసిక్తమైంది. ఈశాన్య థాయ్‌లాండ్‌లోని నోంగ్‌బూ లాంఫూ నగరంలోని డే కేర్ సెంటర్‌పై పన్యా కామ్రాప్(34) విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో అభంశుభం తెలియని 24 మంది చిన్నారులు సహా మొత్తంగా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోజన విరామం సమయంలో అతను డే కేర్ సెంటర్‌కి వచ్చి మొదట ఐదుగురు సిబ్బందిని హతమార్చాడు. తర్వాత ఒక గదిలో నిద్రిస్తున్న చిన్నారులపైకి బుల్లెట్ల వర్షం కురిపించాడు. దాంతో పరుపులన్నీ రక్తంతో నిండి ఘటనాస్థలి భీతావహంగా మారింది.
డే కేర్ సెంటర్‌లో ఎనిమిది నెలల గర్భిణిని సైతం అతడు చంపేశాడు. ఆ తర్వాత కారులో అక్కడి నుంచి పారిపోయాడు. వెళ్తూ వెళ్తూ రహదారి వెంట ఉన్న వారిపైనా తూటాల వర్షం కురిపించాడు. దీంతో ఒక చిన్నారిసహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న అతను తన కొడుకును, భార్యను సైతం చంపేసి చివరకు తనను తాను కాల్చుకుని చనిపోయాడు.
శిశు సంరక్షణాలయంలో చిన్నారుల తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా మారింది. దాడికి అతను పిస్టల్, షాట్‌గన్‌తోపాటు పదునైన కత్తిని వాడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఏడాది తొలినాళ్లలో ఒక మాదకద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అతడిని పోలీసు విధుల నుంచి ప్రభుత్వం తప్పించింది. థాయ్‌లాండ్ చరిత్రలో పాఠశాలలో కాల్పుల ఘటనలో ఇంత మంది మరణించడం ఇదే తొలిసారి. వాస్తవానికి థాయ్‌లాండ్‌లో ఆయుధాలతో దాడి ఘటనలు అరుదు. ఆయుధాలతో దాడి ఘటనల్లో బ్రెజిల్‌లో ప్రతి లక్షలమందికి 23 మంది చనిపోతే థాయ్‌లాండ్‌లో నలుగురే మరణించారు.
ఇదీ చదవండి: 650 కోరికలు.. యూఎస్ ప్రో రెజ్లర్ జాన్ సేనా గిన్నిస్ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment