నగరానికి భారీగా డ్రగ్స్ సరఫరా
ముగ్గురి అరెస్టు రూ.1.15 కోట్ల విలువైన
53.5 కిలోల పాపిస్ట్రా స్వాధీనం
నాగోలు: నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్స్‌ను అదుపులోకి తీసుకున్న ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ, మీర్‌పేట్ పోలీసులు వారి నుంచి రూ.1.15 కోట్ల విలువైన 53.5 కిలోల పాపిస్ట్రా, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం ఎల్‌బీనగర్‌లోని రాచకొండ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు.. రాజస్థాన్‌కు చెందిన మంగిలాల్ భీశాయ్, మంగీలాల్ డాక, బీరా రామ్ నగరంలోని మీర్ పేట్, అశోక్ రెడ్డి కాలనీలో ఉంటూ స్టీల్ రేలింగ్ వర్కర్లుగా పని చేస్తున్నారు.
వీరికి మధ్యప్రదేశ్‌కు చెందిన పింటు అలియాస్ మోహన్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. సులభంగా డబ్బులు సంపాదించేందుకు డ్రగ్స్ విక్రయించాలని నిర్ణయించారు. మోహన్‌సింగ్ తాను మధ్యప్రదేశ్ నుంచి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తానని ఎక్కువ ధరకు ఇతర ప్రాంతాల్లో విక్రయించాలని చెప్పడంతో అందుకు వారు అంగీకరించారు. దీంతో మధ్యప్రదేశ్ వెళ్లిన వారు ముగ్గురు మోహన్‌సింగ్ వద్ద పాపి్రస్టాను కొనుగోలు చేసి రైల్లో నగరానికి తీసుకువచ్చారు.
అశోక్ రెడ్డి నగర్‌లోని తన ఇంట్లో భద్రపరిచిన వారు దానిని బీఎన్‌రెడ్డి నగర్ లో నివాసం ఉంటున్న రాజస్థాన్‌కు చెందిన శంకర్ లాల్, కరీంనగర్‌లో ఉంటున్న శర్వాన్ ద్వారా నగరంలో అధిక ధరకు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. దీనిపై సమాచారం అందడంతో ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ, మీర్‌పేట పోలీసులు ఆదివారం రాత్రి అశోక్ రెడ్డి నగర్‌లోని వారి ఇంటిపై దాడి చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 53.5 కిలోల పాపిస్ట్రా, మూడు మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ఒకరైన మంగీలాల్ 2023లో గంజాయి విక్రయిస్తూ హయత్‌నగర్ పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మోహన్ సింగ్, శంకర్ లాల్, శర్వాన్‌లను త్వరలో అరెస్ట్ చేస్తామని సీపీ తెలిపారు.
మాదక ద్రవ్యాలపై నిరంతర నిఘా..
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మాదకద్రవ్యాల నియంత్రణకు రాచకొండ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నామని, నగర శివార్లలోని రిసార్ట్‌ల యాజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సీపీ పేర్కొన్నారు. సమావేశంలో ఎస్‌ఓటీ డీసీపీ . మురళీధర్,అడిషనల్ డీసీపీ షాకీర్ హుస్సేన్, ఇన్‌స్పెక్టర్లు కీసర నాగరాజు, భాస్కర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment