
గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం మొదటి దశ 500మెగావాట్ల ప్లాంట్‌లో సోమవారం రాత్రి భారీ ప్రమా దం సంభవించింది. ఈ ఘటనలో ఏడు గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వరంగల్‌లోని అజర ఆస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కాకతీయ థర్మల్ విద్యుత్ 500 మెగావాట్ల ప్లాంట్‌లోని కోల్ మిల్లర్‌లో ఇనుప రాడ్డు రావడంతో కార్మికులు దానిని తొలగించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో డోర్‌ను తెరవడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగి కార్మికులకు అంటుకున్నాయి. ప్రమాదంలో జేపీఏ వెంకటేష్, ఆర్జిజన్ కేశమల్ల వీరస్వామితోపాటు బ్రదర్స్ ఇంజనీరింగ్ కాంట్రాక్టు కార్మికులు సీతారాములు, జానకిరాములు, సాయికుమార్, రాజు, మహేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కేటీపీపీ ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.
అందులో ఆర్జిజన్ వీరస్వామి, జేపీఏ వెంకటేష్‌ల పరిస్థితి విషమంగా ఉండడంతో, ఏడుగురిని వరంగల్‌లోని అజర ఆస్పత్రికి తరలించారు. మిల్లర్‌లోకి ఇనుపరాడ్డు రావడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఆస్తినష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. గాయపడిన కార్మికుల్లో ఐదుగురు విజయవాడనుంచి సోమవారమే కేటీపీపీకి వచ్చినట్లు తెలిసింది. కేటీపీపీ పవర్‌ప్లాంట్‌లో మొదటిసారి ప్రమాదం జరగడంతో ఇంజనీర్లు, కార్మికులు షాక్‌కు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment