ప్రతీకాత్మక చిత్రం
కందుకూరు(నెల్లూరు జిల్లా): ప్రాణ స్నేహితుడని నమ్మిన పాపానికి అతని భార్యపైనే కన్నేశాడు ఓ ప్రబుద్ధుడు. స్నేహితుడిని మద్యం తాగించి అతని భార్యకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ వీడియోలు తీసి పలుమార్లు బెదిరిస్తుండడంతో ఆ దంపతులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన గురువారం నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలోని చినపవని గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరులోని రంగనాయకులపేటకు చెందిన వ్యక్తి నెల్లూరు కార్పొరేషన్ వాటర్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు.
చదవండి: అర్ధరాత్రి ఫోన్.. భర్త వార్నింగ్.. గంట తర్వాత చూస్తే..
అతని స్నేహితుడు ఇలియాజ్ ఆ కార్పొరేషన్ పరిధిలోనే లష్కర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. వీరు తరచూ కలిసి మద్యం తాగే అలవాటు ఉంది. ఇదిలా ఉంటే ఇలియాజ్ స్నేహితుడి కుమార్తెకు లింగసముద్రం మండలంలోని చినపవని గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. దీంతో ఈ నెల 20వ తేదీన చినపవని గ్రామంలో పెళ్లిని ఘనంగా జరిపించారు. పెళ్లి వేడుకల్లో భాగంగా గత మూడు రోజులుగా పెళ్లికుమార్తె తల్లిదండ్రులతోపాటు, ఇలియాజ్ కూడా అక్కడే ఉంటున్నాడు. అయితే ఇలియాజ్.. అతని స్నేహితుడి భార్యతో సన్నిహితంగా ఉండడాన్ని గమనించిన బంధువులు అతన్ని పట్టుకుని కొట్టారు.
దీంతో అదే రోజు ఇలియాజ్ నెల్లూరుకు వెళ్లిపోయాడు. ఈ వివాదం నేపథ్యంలో ఇలియాజ్ స్నేహితుడికి, అతని భార్యకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. భార్యాభర్తలిద్దరూ గత రెండు, మూడు రోజులుగా గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం అకస్మాత్తుగా దంపతులిద్దరూ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తమ చావుకు కారణం ఇలియాజ్‌తోపాటు మరికొందరి పేర్లు చెప్పారు.
స్నేహితుడిగా నమ్మినందుకు ఇలియాజ్ తన భార్యకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి లైంగికదాడికి పాల్పడ్డాడని, వీడియో తీసి తరచూ బ్లాక్‌మెయిల్ చేస్తూ లైంగికదాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో అవమానభారం భరించలేక పురుగుమందు తాగుతున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుమందు తాగారు. కొద్దిసేపటికి ఇది గమనించిన బంధువులు దంపతులిద్దరినీ చికిత్సనిమిత్తం కావలిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇలియాజ్ స్నేహితుడి పరిస్థితి విషమంగా ఉందని బంధువులు తెలిపారు. సమాచారం అందుకున్న లింగసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment