ప్రకాశం జిల్లాలో మనీ సర్క్యులేషన్ స్కీమ్
ప్రైవేటు ఉపాధ్యాయులు, చిరు వ్యాపారులే లక్ష్యం
రూ.100 కడితే రూ.700 చెల్లిస్తామంటూ బడా మోసం
నాలుగైదు రోజుల నుంచి చెల్లింపులు నిలిపివేత
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురంలో మనీ సర్క్యులేషన్ స్కీమ్ ముంచేసింది. ఒక్క రూపాయి కడితే ఏడు రూపాయలు, రూ.100 కడితే రూ.700 చెల్లిస్తామంటూ వల విసిరి బాధితులకు శఠగోపం పెట్టింది. ప్రైవేటు ఉపాధ్యాయులు, యువత, చిరు వ్యాపారులు, సాధారణ ప్రజలు భారీ ఆదాయం వస్తుందనే ఆశతో ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. మొదట్లో వారికి బాగానే డబ్బులు వచ్చాయి.
అయితే నాలుగు రోజుల నుంచి కొంతమందికి డబ్బులు రాకపోవడంతో విషయం బయటకు వచ్చింది. ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ యజమాని ఎక్కడుంటాడో తెలీదు.. చెన్నై కేంద్రంగా అంతా కేవలం ఆన్‌లైన్ ద్వారానే నగదు చెల్లింపులు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఒక్క మార్కాపురంలోనే కాకుండా పెద్దారవీడు, తర్లుపాడు, పెద్ద దోర్నాల, త్రిపురాంతకం, యర్రగొండపాలెం తదితర మండలాలకు కూడా ఈ చైన్ లింకు స్కీమ్ విస్తరించినట్టు సమాచారం.
మై క్వీన్ యాప్ లింక్ పంపి..
ఒక్క రూపాయి కడితే మరుసటి రోజు రూ.7 అకౌంట్లో జమయ్యేలా మనీ సర్క్యులేషన్ స్కీమ్‌ను రూపొందించారు. ఈ చైన్ సిస్టమ్‌లో భాగంగా మొదట డబ్బులు చెల్లించిన వ్యక్తికి ‘మై క్వీన్’ యాప్ లింక్ పంపుతారు. ఆ వ్యక్తి మరో కొంత మందిని చేర్పిస్తే వారికి కూడా లింక్‌ను షేర్ చేస్తారు. ఇందులో బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్‌లోడ్ చేయాలి. రూ.100 ఈ రోజు చెల్లిస్తే 24 గంటలు గడిచాక నగదు చెల్లించిన వ్యక్తి ఖాతాలో రూ.700 జమవుతాయి.
దీంతో 24 గంటల్లోనే తాము కట్టిన దానికి 7 రెట్లు ఆదాయం రావడంతో ఈ యాప్ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. దీంతో ఒక్క మార్కాపురం పట్టణంలోనే 8 నుంచి 10 వేల మంది సభ్యులుగా చేరి సుమారు రూ.5 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది. గతంలో ఇలాంటి స్కీమ్‌ల విషయంలో మోసపోయినా ప్రజలు లెక్కచేయడం లేదు. త్వరగా డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ మై క్వీన్ యాప్‌లో పెట్టుబడులు పెడుతున్నారు.
నెల రోజుల్లోనే లక్షాధికారులు కావాలనే దురాశ వారిని తెగించేలా చేస్తోంది. ఈ క్రమంలో కొంతమందికి కొన్ని రోజుల నుంచి నగదు చెల్లింపులు కావడంలేదని తెలుస్తోంది. ఈ విషయమై మార్కాపురం సీఐ ఆవుల వెంకటేశ్వర్లును వివరణ కోరగా ఇప్పటివరకూ ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ప్రజలెవరూ ఇలాంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్‌ల్లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment