Money circulation scheme
-
ముంచేసిన ‘మై క్వీన్’
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురంలో మనీ సర్క్యులేషన్ స్కీమ్ ముంచేసింది. ఒక్క రూపాయి కడితే ఏడు రూపాయలు, రూ.100 కడితే రూ.700 చెల్లిస్తామంటూ వల విసిరి బాధితులకు శఠగోపం పెట్టింది. ప్రైవేటు ఉపాధ్యాయులు, యువత, చిరు వ్యాపారులు, సాధారణ ప్రజలు భారీ ఆదాయం వస్తుందనే ఆశతో ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. మొదట్లో వారికి బాగానే డబ్బులు వచ్చాయి. అయితే నాలుగు రోజుల నుంచి కొంతమందికి డబ్బులు రాకపోవడంతో విషయం బయటకు వచ్చింది. ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ యజమాని ఎక్కడుంటాడో తెలీదు.. చెన్నై కేంద్రంగా అంతా కేవలం ఆన్లైన్ ద్వారానే నగదు చెల్లింపులు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఒక్క మార్కాపురంలోనే కాకుండా పెద్దారవీడు, తర్లుపాడు, పెద్ద దోర్నాల, త్రిపురాంతకం, యర్రగొండపాలెం తదితర మండలాలకు కూడా ఈ చైన్ లింకు స్కీమ్ విస్తరించినట్టు సమాచారం. మై క్వీన్ యాప్ లింక్ పంపి.. ఒక్క రూపాయి కడితే మరుసటి రోజు రూ.7 అకౌంట్లో జమయ్యేలా మనీ సర్క్యులేషన్ స్కీమ్‌ను రూపొందించారు. ఈ చైన్ సిస్టమ్‌లో భాగంగా మొదట డబ్బులు చెల్లించిన వ్యక్తికి ‘మై క్వీన్’ యాప్ లింక్ పంపుతారు. ఆ వ్యక్తి మరో కొంత మందిని చేర్పిస్తే వారికి కూడా లింక్‌ను షేర్ చేస్తారు. ఇందులో బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్లోడ్ చేయాలి. రూ.100 ఈ రోజు చెల్లిస్తే 24 గంటలు గడిచాక నగదు చెల్లించిన వ్యక్తి ఖాతాలో రూ.700 జమవుతాయి. దీంతో 24 గంటల్లోనే తాము కట్టిన దానికి 7 రెట్లు ఆదాయం రావడంతో ఈ యాప్ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. దీంతో ఒక్క మార్కాపురం పట్టణంలోనే 8 నుంచి 10 వేల మంది సభ్యులుగా చేరి సుమారు రూ.5 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది. గతంలో ఇలాంటి స్కీమ్‌ల విషయంలో మోసపోయినా ప్రజలు లెక్కచేయడం లేదు. త్వరగా డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ మై క్వీన్ యాప్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. నెల రోజుల్లోనే లక్షాధికారులు కావాలనే దురాశ వారిని తెగించేలా చేస్తోంది. ఈ క్రమంలో కొంతమందికి కొన్ని రోజుల నుంచి నగదు చెల్లింపులు కావడంలేదని తెలుస్తోంది. ఈ విషయమై మార్కాపురం సీఐ ఆవుల వెంకటేశ్వర్లును వివరణ కోరగా ఇప్పటివరకూ ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ప్రజలెవరూ ఇలాంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్‌ల్లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని హెచ్చరించారు. -
మనీ సర్క్యులేషన్ స్కామ్ బట్టబయలు
-
మనీ సర్క్యులేషన్ స్కామ్ బట్టబయలు
సాక్షి, హైదరాబాద్: భారీ మనీ సర్క్యులేషన్ స్కామ్‌ను సైబరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో భారీ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా 10 లక్షల మందిని మోసం చేసినట్లు వెల్లడించారు. ఈ మనీ స్కీమ్ గ్యాంగ్ రూ.1500 కోట్ల మేర వసూలు చేసినట్లు గుర్తించారు. మాదాపూర్‌లోని ఓ ప్రముఖ హోటల్లో నిందితులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. డైరెక్టర్స్ సహా 24 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. 20 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారు. సాయంత్రం మూడు గంటలకు నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు. చదవండి: కేటీఆర్ పీఏనంటూ టోకరా మిస్సింగ్ కేసు: బాలికకు మాయమాటలు చెప్పి.. -
బైక్ మోజు.. వదులుతున్న చిలుము
సిరిసిల్ల : బైక్‌పై ఉన్న మోజును సొమ్ము చేసుకునేందుకు కొందరు సులభ వాయిదాల పేరిట మనీ సర్క్యూలేషన్ స్కీంల దందా చేస్తున్నారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ద్విచక్ర వాహనాలను ఆశగా చూపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. వేములవాడ, సిరిసిల్ల కేంద్రాలుగా సాగుతున్న ఈ అక్రమ దందా కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాలకూ విస్తరించింది. ఇది స్కీం సులభ వాయిదాల్లో మీకు నచ్చిన వాహనం తీసుకోండంటూ ప్రచారం చేస్తున్నారు. స్కీం కా లపరమితి 36 నెలలు. ఒక్కో విభాగంలో 300 మందికి అవకాశం ఇస్తున్నారు. సభ్యత్వ రుసుముగా రూ.200 చెల్లించాలి. సభ్యుడు ప్రతినెలా రూ.1500 చొప్పున 36 నెలలు చెల్లించాలి. ప్ర తినెల మూడో ఆదివారం ఉత్తమ సభ్యుడు కో సం డ్రా తీస్తారు. లక్కీడ్రా పేరెత్తకుండా ఉత్తమ సభ్యుడు అనే పేరుతో లక్కీలాటరీని నిర్వహిస్తున్నారు. డ్రాలో పేరొచ్చిన సభ్యుడు ఇకపై డబ్బు లు కట్టన వసరం లేదని చెబుతారు. ఇదే ఆశతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సభ్యులు చేరుతున్నారు. ఇందులో సభ్యులను చేర్చే ఏజెంట ్లకు ఒక్కో సభ్యునికి రూ.వెయ్యి చొప్పున కమీషన్ ఇస్తున్నారు. ప్రతినెలా 300 మంది సభ్యుల నుంచి రూ.1500 చొప్పున రూ.4.50 లక్షలు వసూలు చేస్తున్నారు. డ్రాలో వచ్చిన సభ్యుడికి రూ.50వేల లోపు బైక్ ఇస్తున్నారు. ఒక్కో గ్రూ పులో 300 మంది ఉండగా, ఏ,బీ,సీ,డీ,ఈ,ఎఫ్ గ్రూపులుగా విభజించి ఆరు గ్రూపుల్లో మొత్తం 1800 మందితో దందా సాగిస్తున్నారు. ఇలా నెలనెలా రూ.27 లక్షల వరకు వసూలు చేస్తూ అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అక్రమ మార్గంలో.. ఒక సభ్యుడిని చేర్పిస్తే రూ.వెయ్యి కమీషన్ ఇస్తూ అక్రమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. ముప్పై మందిని చేర్పిస్తే బైక్ ఫ్రీ అంటూ ఆఫర్ ఇస్తున్నారు. లక్షల్లో డబ్బులు రావడంతో నిర్వాహకులు సొంతంగా బైక్ షోరూంలు నిర్వహి స్తూ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. మరోవైపు వా యిదా డబ్బులు చెల్లించకుండా సదరు సభ్యు డు అప్పటివరకు చెల్లించిన సొమ్ములను తిరిగి ఇవ్వబడవని స్పష్టం చేస్తున్నారు. ఏ కారణం చేతనైనా 12వ తేదీలోపల డబ్బులు చెల్లించకుంటే అదనంగా రూ.100 వసూలు చేస్తున్నా రు. లక్కీడ్రాలో పేరు వచ్చినవారు మాత్రం సం తోషంగా బైక్ తీసుకెళ్తుండగా, మిగతావారికి మాత్రం డబ్బులు చెల్లిస్తూ అదృష్టాన్ని పరీక్షిం చుకుంటున్నారు. ముందే బైక్ కావాలనుకునేవారు బండి కాగితాలు కుదువబెట్టి హైర్‌పర్చేస్ ఒప్పందంలో వాహనాలు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఆర్థిక స్తోమత లేనివారు ఆశగా చేరి మధ్యలో డబ్బులు చెల్లించలేకపోతే అప్పటివరకు కట్టిన డబ్బులు జప్తు అవుతున్నాయి. రాజకీయ అండదండలు.. ఈ అక్రమ దందా సాగిస్తున్న వారికి రాజకీయ అండదండలు మెండుగా ఉన్నాయి. కొందరు నాయకులు అండగా ఉంటూ డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రజల నుంచి నేరుగా డబ్బులు వసూలు చేసినప్పుడు ఎంటర్‌ప్రైజెస్‌ను రిజిస్ట్రర్ చేయించుకొని చట్టబద్ధంగా పోలీసు అనుమతి తీసుకొని ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం మధ్యతరగతి ప్రజల ఆశే పెట్టుబడిగా అక్రమ వ్యాపారం సాగుతోంది. నెలనెలా కొత్తకొత్త గ్రూపులను తయారు చేస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ఈ విషయమై ఓ నిర్వాహకుడి వివరణ కోసం ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. ల్యాండ్ ఫోన్‌కు ట్రై చేస్తే నేను మెకానిక్‌ను, నాకు సంబంధం లేదంటూ పేర్కొన్నారు. -
ఇదీ ఆమ్వే కథ
* అమెరికా కేంద్రంగా 108 దేశాల్లో కార్యకలాపాలు * 1994లో భారత్‌లో అడుగు.. * దేశవ్యాప్తంగా వ్యాపారం విస్తరణ సాక్షి, హైదరాబాద్: అమెరికా కేంద్రంగా 108 దేశాల్లో కార్య కలాపాలు సాగిస్తున్న ఆమ్వే సంస్థ 1994లో భారత్‌లో అడుగుపెట్టింది. 1995లో ఇండియన్ డెరైక్ట్ సెల్లింగ్ అసో సియేషన్ (ఐడీఎస్ఏ) అనే వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి ఆ తర్వాతి ఏడాది అమ్వే ఆపర్చునిటీ ఫెడరేషన్ (ఏఓఎఫ్) పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ప్రజల దృష్టిని ఆకర్షించింది. 1998 నుంచి గొలుసుకట్టు వ్యవహారంగా పిలిచే మల్టీ లెవల్ మార్కెటింగ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లకు తెరలేపింది. సంస్థలో సభ్యుడిగా చేరి ఉత్పత్తులు కొనుగోలు చేసిన వ్యక్తి మరొకరిని రూ.4500 చెల్లించడం ద్వారా సభ్యుడిగా చేర్పించాలి. ఈ రకంగా మూడు రకాలైన స్కీముల్ని ప్రవేశపెట్టి దేశ వ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించింది. ఆర్బీఐ ఫిర్యాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదుతో ఆమ్వేపై 2002లో చండీగఢ్ పోలీసులు తొలికేసు నమోదు చేశారు. ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధం) చట్టం-1978 ప్రకారం ఆమ్వే ప్రజల్ని మోసం చేస్తున్నట్లే అని అప్పటి ఆర్థిక మంత్రి సైతం లోక్‌సభలో ప్రకటిం చారు. రాష్ట్ర నేర పరిశోధన విభాగం(సీఐడీ) పోలీసులకు ఫిర్యాదు అందడంతో 2006లో కేసు నమోదు చేశారు. రాష్ట్రంలోని ఆమ్వే కార్యాలయాలపై దాడులు చేసి డాక్యుమెంట్లను, వస్తువులను సీజ్ చేశారు. దీనిపై ఆమ్వే హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సైతం కేసు నమోదును సమర్థించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ 2007లో ఆమ్వే సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సైతం న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో సీఐడీ పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి 2008లో నాంపల్లి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇప్పటిదాకా సీఐడీతో పాటు గుంటూరు, కృష్ణ, ప్రకాశం, మెదక్, హైదరాబాద్, సైబరాబాద్, కర్నూలు పోలీసులూ ఆమ్వేపై కేసులు నమోదు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ కూడా ఆమ్వేపై ఫెమా ఉల్లంఘనల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. కేరళలో నమోదైన కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు సంస్థ సీఈఓ విలియం స్కాట్‌ను గతంలో ఒకసారి అరెస్టు చేసి విడిచిపెట్టారు. తాజాగా కర్నూలు పోలీసులు అరెస్టు చేయడంతో ఈ అమెరికా జాతీయుడు రెండోసారి కటకటాల్లో చేరినట్లైంది. సమాచారం లేకుండా అరెస్టు చేశారు: ఆమ్వే కర్నూలు పోలీసులు తమ సంస్థపై గత ఏడాది డిసెంబర్ లోనే కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు తమకు సమాచారం ఇవ్వలేదని ఆమ్వే పీఆర్వో సుశాంత్ సుబుధి అన్నారు. మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఎఫ్ఐఆర్లో పోలీసులు ఆరోపించిన అంశాలు వాస్తవదూరమని పేర్కొన్నారు. ఇప్పటికే నమోదైన కేసుల దర్యాప్తునకు ఆమ్వే సంస్థ పూర్తి సహకారం అందిస్తోందని, పోలీసులు కోరిన సమాచారంతో పాటు పత్రాలు అందించిందని సుశాంత్ తెలిపారు.