* అమెరికా కేంద్రంగా 108 దేశాల్లో కార్యకలాపాలు
* 1994లో భారత్‌లో అడుగు..
* దేశవ్యాప్తంగా వ్యాపారం విస్తరణ
సాక్షి, హైదరాబాద్: అమెరికా కేంద్రంగా 108 దేశాల్లో కార్య కలాపాలు సాగిస్తున్న ఆమ్వే సంస్థ 1994లో భారత్‌లో అడుగుపెట్టింది. 1995లో ఇండియన్ డెరైక్ట్ సెల్లింగ్ అసో సియేషన్ (ఐడీఎస్‌ఏ) అనే వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి ఆ తర్వాతి ఏడాది అమ్వే ఆపర్చునిటీ ఫెడరేషన్ (ఏఓఎఫ్) పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ప్రజల దృష్టిని ఆకర్షించింది. 1998 నుంచి గొలుసుకట్టు వ్యవహారంగా పిలిచే మల్టీ లెవల్ మార్కెటింగ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లకు తెరలేపింది. సంస్థలో సభ్యుడిగా చేరి ఉత్పత్తులు కొనుగోలు చేసిన వ్యక్తి మరొకరిని రూ.4500 చెల్లించడం ద్వారా సభ్యుడిగా చేర్పించాలి. ఈ రకంగా మూడు రకాలైన స్కీముల్ని ప్రవేశపెట్టి దేశ వ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించింది.
ఆర్‌బీఐ ఫిర్యాదు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదుతో ఆమ్వేపై 2002లో చండీగఢ్ పోలీసులు తొలికేసు నమోదు చేశారు. ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధం) చట్టం-1978 ప్రకారం ఆమ్వే ప్రజల్ని మోసం చేస్తున్నట్లే అని అప్పటి ఆర్థిక మంత్రి సైతం లోక్‌సభలో ప్రకటిం చారు. రాష్ట్ర నేర పరిశోధన విభాగం(సీఐడీ) పోలీసులకు ఫిర్యాదు అందడంతో 2006లో కేసు నమోదు చేశారు. రాష్ట్రంలోని ఆమ్వే కార్యాలయాలపై దాడులు చేసి డాక్యుమెంట్లను, వస్తువులను సీజ్ చేశారు. దీనిపై ఆమ్వే హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సైతం కేసు నమోదును సమర్థించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ 2007లో ఆమ్వే సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సైతం న్యాయస్థానం తోసిపుచ్చింది.
దీంతో సీఐడీ పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి 2008లో నాంపల్లి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇప్పటిదాకా సీఐడీతో పాటు గుంటూరు, కృష్ణ, ప్రకాశం, మెదక్, హైదరాబాద్, సైబరాబాద్, కర్నూలు పోలీసులూ ఆమ్వేపై కేసులు నమోదు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ కూడా ఆమ్వేపై ఫెమా ఉల్లంఘనల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. కేరళలో నమోదైన కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు సంస్థ సీఈఓ విలియం స్కాట్‌ను గతంలో ఒకసారి అరెస్టు చేసి విడిచిపెట్టారు. తాజాగా కర్నూలు పోలీసులు అరెస్టు చేయడంతో ఈ అమెరికా జాతీయుడు రెండోసారి కటకటాల్లో చేరినట్లైంది.
సమాచారం లేకుండా అరెస్టు చేశారు: ఆమ్వే
కర్నూలు పోలీసులు తమ సంస్థపై గత ఏడాది డిసెంబర్ లోనే కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు తమకు సమాచారం ఇవ్వలేదని ఆమ్వే పీఆర్వో సుశాంత్ సుబుధి అన్నారు. మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు ఆరోపించిన అంశాలు వాస్తవదూరమని పేర్కొన్నారు. ఇప్పటికే నమోదైన కేసుల దర్యాప్తునకు ఆమ్వే సంస్థ పూర్తి సహకారం అందిస్తోందని, పోలీసులు కోరిన సమాచారంతో పాటు పత్రాలు అందించిందని సుశాంత్ తెలిపారు.
ఇదీ ఆమ్వే కథ
Published Wed, May 28 2014 4:58 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
Advertisement
Advertisement