Amway Corporation
-
ఇదీ ఆమ్వే కథ
* అమెరికా కేంద్రంగా 108 దేశాల్లో కార్యకలాపాలు * 1994లో భారత్‌లో అడుగు.. * దేశవ్యాప్తంగా వ్యాపారం విస్తరణ సాక్షి, హైదరాబాద్: అమెరికా కేంద్రంగా 108 దేశాల్లో కార్య కలాపాలు సాగిస్తున్న ఆమ్వే సంస్థ 1994లో భారత్‌లో అడుగుపెట్టింది. 1995లో ఇండియన్ డెరైక్ట్ సెల్లింగ్ అసో సియేషన్ (ఐడీఎస్ఏ) అనే వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి ఆ తర్వాతి ఏడాది అమ్వే ఆపర్చునిటీ ఫెడరేషన్ (ఏఓఎఫ్) పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ప్రజల దృష్టిని ఆకర్షించింది. 1998 నుంచి గొలుసుకట్టు వ్యవహారంగా పిలిచే మల్టీ లెవల్ మార్కెటింగ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లకు తెరలేపింది. సంస్థలో సభ్యుడిగా చేరి ఉత్పత్తులు కొనుగోలు చేసిన వ్యక్తి మరొకరిని రూ.4500 చెల్లించడం ద్వారా సభ్యుడిగా చేర్పించాలి. ఈ రకంగా మూడు రకాలైన స్కీముల్ని ప్రవేశపెట్టి దేశ వ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించింది. ఆర్బీఐ ఫిర్యాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదుతో ఆమ్వేపై 2002లో చండీగఢ్ పోలీసులు తొలికేసు నమోదు చేశారు. ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధం) చట్టం-1978 ప్రకారం ఆమ్వే ప్రజల్ని మోసం చేస్తున్నట్లే అని అప్పటి ఆర్థిక మంత్రి సైతం లోక్‌సభలో ప్రకటిం చారు. రాష్ట్ర నేర పరిశోధన విభాగం(సీఐడీ) పోలీసులకు ఫిర్యాదు అందడంతో 2006లో కేసు నమోదు చేశారు. రాష్ట్రంలోని ఆమ్వే కార్యాలయాలపై దాడులు చేసి డాక్యుమెంట్లను, వస్తువులను సీజ్ చేశారు. దీనిపై ఆమ్వే హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సైతం కేసు నమోదును సమర్థించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ 2007లో ఆమ్వే సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సైతం న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో సీఐడీ పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి 2008లో నాంపల్లి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇప్పటిదాకా సీఐడీతో పాటు గుంటూరు, కృష్ణ, ప్రకాశం, మెదక్, హైదరాబాద్, సైబరాబాద్, కర్నూలు పోలీసులూ ఆమ్వేపై కేసులు నమోదు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ కూడా ఆమ్వేపై ఫెమా ఉల్లంఘనల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. కేరళలో నమోదైన కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు సంస్థ సీఈఓ విలియం స్కాట్‌ను గతంలో ఒకసారి అరెస్టు చేసి విడిచిపెట్టారు. తాజాగా కర్నూలు పోలీసులు అరెస్టు చేయడంతో ఈ అమెరికా జాతీయుడు రెండోసారి కటకటాల్లో చేరినట్లైంది. సమాచారం లేకుండా అరెస్టు చేశారు: ఆమ్వే కర్నూలు పోలీసులు తమ సంస్థపై గత ఏడాది డిసెంబర్ లోనే కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు తమకు సమాచారం ఇవ్వలేదని ఆమ్వే పీఆర్వో సుశాంత్ సుబుధి అన్నారు. మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఎఫ్ఐఆర్లో పోలీసులు ఆరోపించిన అంశాలు వాస్తవదూరమని పేర్కొన్నారు. ఇప్పటికే నమోదైన కేసుల దర్యాప్తునకు ఆమ్వే సంస్థ పూర్తి సహకారం అందిస్తోందని, పోలీసులు కోరిన సమాచారంతో పాటు పత్రాలు అందించిందని సుశాంత్ తెలిపారు. -
ఆమ్వే సీఈఓ ఆటకట్టు
విలియం స్కాట్ పింక్నీని గుర్గావ్లో అరెస్టు చేసి కర్నూలుకు తరలించిన పోలీసులు 15 రోజుల రిమాండ్‌కు ఆదేశించిన మేజిస్ట్రేట్ సాక్షి, కర్నూలు: గొలుసుకట్టు పథకాల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ నమోదైన కేసులో ‘ఆమ్వే’ సంస్థ సీఈఓ విలియం స్కాట్ పింక్నీని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఎస్పీ రఘురామిరెడ్డి మీడియా ఎదుట ఆయనను ప్రవేశపెట్టారు. కర్నూలుకు చెందిన న్యాయవాది జగన్నాథ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు నగరంలోని రెండవ పట్టణ పోలీసులు 2013 డిసెంబర్లో ప్రైజ్‌చిట్స్, మనీ సర్క్యులేషన్ వ్యాపారాల నిషేధ చట్టం, మోసం, దోపిడీ నేరాల కింద.. ఆమ్వేపై కేసు నమోదు చేశామని ఎస్పీ చెప్పారు. ‘‘ఆమ్వే ఇండియా ఎంటర్ప్రైజెస్ కంపెనీ కొన్ని సంవత్సరాలుగా మనీ సర్క్యులేషన్ స్కీమ్ (గొలుసు కట్టు పథకం) పేరిట వ్యాపారం కొనసాగిస్తూ.. కంపెనీ ఉత్పత్తుల వ్యాపారం ముసుగులో కుట్రపూరితమైన మోసానికి పాల్పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో మంది అమాయకులు ఈ కంపెనీ మాయలో జేబులు గుల్ల చేసుకున్నారు’’ అని న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. గుర్గావ్లో అరెస్టు కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం న్యూఢిల్లీలోని గుర్గావ్లో ఉన్న ఆమ్వే కార్యాలయంలో ఆ సంస్థ సీఈవో, అమెరికాకు చెందిన విలియం స్కాట్‌ను ప్రత్యేక పోలీసుల బృందం అరెస్టు చేసి కర్నూలుకు తరలించింది. విలియంతో పాటు కర్నూలుకు చెందిన వినయ్‌కుమార్, ఎర్రం నాయుడు, నంద్యాలకు చెందిన వెంకటేశ్వర్లుపైనా కేసు నమోదైంది. కర్నూలులో ఆమ్వే కంపెనీకి చెందిన కార్యాలయాలను, ఉత్పత్తుల నిల్వకు ఉపయోగించే గోదాములను, వస్తువులను సీజ్ చేస్తామని.. కంపెనీ లావాదేవీలను తనిఖీ చేస్తామని ఎస్పీ తెలిపారు. తక్కువ సమయంలో ధనవంతులు కావచ్చని ప్రలోభపెట్టే ఇలాంటి సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. విలేకరుల సమావేశం అనంతరం విలియంను డోన్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్‌కు ఆదేశించారు. అక్కడి నుంచి అతడిని పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ వ్యాపారం చట్ట వ్యతిరేకం: ఎస్పీ ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమ్వే సంస్థ చేస్తున్న వ్యాపారం చట్ట వ్యతిరేకమని దేశవ్యాప్తంగా ఇప్పటికే వివిధ కోర్టులు తీర్పునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 2006 సెప్టెంబర్ 24న సీఐడీ పోలీసులు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, నిజామాబాద్, కర్నూలు, కాకినాడ, గుంటూరు, నెల్లూరులలోని ఆమ్వే కార్యాలయాలపై దాడులు చేసి డాక్యుమెంట్లను, వస్తువులను సీజ్ చేశారు. దీనిపై ఆమ్వే సంస్థ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రెండు రిట్ పిటిషన్లను దాఖలు చేయగా.. ఆమ్వే సంస్థ సాగిస్తున్న వ్యాపారం చట్ట విరుద్ధమని కోర్టు తేల్చి చెప్పింది. అయినప్పటికీ ఆ సంస్థ తన వ్యాపారాలను ఇంటర్నెట్ ద్వారా కొనసాగిస్తోంది. తక్కువ సమయంలో ధనవంతులు కావచ్చని ప్రలోభపెట్టే ఇలాంటి సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. విలేకరుల సమావేశం అనంతరం విలియంను డోన్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌ఎదుట హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్‌కు ఆదేశించారు. అక్కడి నుంచి అతడిని పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు: ఆమ్వే సంస్థపై మన రాష్ట్రంతో పాటు కేరళ, పశ్చిమ బెంగాల్లోనూ పలు కేసులు నమోదయ్యాయి. మన రాష్ట్రంలో ఈ సంస్థపై నమోదైన కేసుల్లో విలియంను అరెస్టు చేసేందుకు ‘ప్రిజినర్ ట్రాన్సిట్ వారెంట్’ను జారీ చేయాలని సీఐడీ పోలీసులు ప్రయత్నిం చారు. ఆలోపు ఆయన ముందస్తు బెయిల్ పొందడంతో తప్పించుకున్నారు. ఇంటర్నెట్ద్వారా మల్టీలెవల్ మార్కె టింగ్ చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని 2007లో కాలి ఫోర్నియా కోర్టులో ఓ కేసు నమోదవగా.. ఈ కేసుకు సంబం ధించి 2010 నవంబర్ 3న 5.6 కోట్ల డాలర్లను కంపెనీ రాజీ కుదుర్చుకుంది. కాగా, తమ వ్యాపారాలు చట్టబద్ధంగా చేస్తు న్నామంటూ ఆమ్వే సంస్థ మంగళవారం ఒక ప్రకటన విడు దల చేసింది. భారత్‌లో డెరైక్ట్ సెల్లింగ్ వ్యాపారాలపై ప్రభు త్వం స్పష్టత ఇవ్వాలని ఆ ప్రకటనలో కోరింది. 1998లో భారత్‌లో రూ.200 కోట్లతో తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించిన ఆమ్వే సంస్థ అనతి కాలంలోనే వేల కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరుకుందని తెలిపింది. దేశ వ్యాప్తంగా తమ సంస్థకు 135 బ్రాంచీలున్నాయని, ఐదువిభాగాల్లో 140 పైగా ఉత్పత్తులను తాము చైన్ మార్కెటింగ్ ద్వారా విక్రయిస్తున్నామని పేర్కొంది. -
గొలుసుకట్టు.. ఆటకట్టు
సాక్షి, కర్నూలు : విదేశీ పెట్టుబడులకు దేశం ద్వారాలు తెరవడంతో 1995లో ఆమ్వే సంస్థ ఇండియన్ డెరైక్ట్ సెల్లింగ్ అసోసియేషన్(ఐడీఎస్ఏ) పేరిట తన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత ఉత్పత్తుల విక్రయం ముసుగులో గొలుసుకట్టు వ్యాపారానికి తెరతీసింది. అనతికాలంలోనే సంస్థ టర్నోవర్ 3 వేల కోట్లకు చేరుకోవడం గమనార్హం. సంస్థలో మొదట రూ.4,400 చెల్లించి ఏజెంట్‌గా సభ్యత్వం తీసుకున్న వ్యక్తి ఆరుగురిని సభ్యులుగా చేర్పించాల్సి ఉంటుంది. ఈ ఆరుగురు నలుగురిని.. ఆ నలుగురు మరో ముగ్గురిని 6-4-3 పద్ధతిని సంస్థలో భాగస్వాములను చేయాలనేది నిబంధన. ఇలా 102 మంది సభ్యులతో గొలుసుకట్టు పూర్తయితే మొదటి వ్యక్తికి ప్రతి నెలా వ్యాపారంలో 3 శాతం సొమ్ము వస్తుంది. అలా తన కార్యకలాపాలపై సంస్థ విస్తృత ప్రాచుర్యం కల్పించింది. సభ్యులకు ఆమ్వే సంస్థ తమ ఉత్పత్తులకు సంబంధించిన ఒక కిట్ అందజేస్తుంది. గొలుసుకట్టు సభ్యులు రెండు వైపులా(లెఫ్ట్, రైట్) వ్యాపారం చేస్తేనే మొదటి వ్యక్తికి కమీషన్ ముడుతుంది. రూ.60 వేల వ్యాపారంలో 3 శాతం కమీషన్ చొప్పున రూ.1,500 అకౌంట్లో జమ అవుతుంది. వ్యాపారం బాగా చేసిన వ్యక్తులను సిల్వర్, గోల్డ్, ఎమరాల్డ్, ప్లాటినమ్, డైమండ్లుగా పరిగణిస్తారు. గొలుసుకట్టులో రెండు వైపులా రూ.6 లక్షల వ్యాపారం చేస్తే సిల్వర్ ర్యాంకు వస్తుంది. అలాకాకుండా ఒకవైపే బిజినెస్ జరిగితే మొదటి వ్యక్తికి వచ్చేది ఏమీ ఉండదు. బిజినెస్ సరిగా చేయలేని సభ్యులను సంస్థ ప్రతినిధులు ఒత్తిడికి పాల్పడుతున్నట్లు కేరళకు చెందిన ఓ మహిళ 2011లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమ్వే కారణంగా తాను పెద్ద మొత్తంలో నష్టపోయినట్లు ఆమె పేర్కొంది. 2006లో మన రాష్ట్రంలోనూ సంస్థపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గొలుసుకట్టుతో ఆమ్వే అక్రమాలకు పాల్పడుతోందంటూ అదే ఏడాది హైదరాబాద్‌కు చెందిన అల్టూస్ సిస్టమ్స్ డెరైక్టర్ ఏవీఎస్ సత్యనారాయణ ఫిర్యాదు చేయడంతో సీఐడీ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, నిజామాబాద్, కర్నూలు, కాకినాడ, గుంటూరు, నెల్లూరు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి ఉత్పత్తులను సీజ్ చేశారు. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో సంస్థపై కేసులు నమోదయ్యాయి. అప్పట్లో సంస్థ హైకోర్టులో రెండు రిట్ పిటిషన్లు దాఖలు చేసింది. విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం సంస్థ వ్యాపారం చట్టవిరుద్ధమని పేర్కొంటూ తీర్పునిచ్చింది. దీనిపై ఆమ్వే సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడా చుక్కెదురైంది. ఆమ్వే వ్యాపారంలో రాజకీయ దిగ్గజాలతో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు సీఐడీ పోలీసుల విచారణలో వెల్లడి కావడం ఆందోళన కలిగించే అంశం. న్యాయవాది ఫిర్యాదు: ఆమ్వే సంస్థ కొందరు డిస్టిబ్యూటర్లను బెదిరిస్తోందంటూ చేసిన ఫిర్యాదు మేరకు 2011లో కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి సంస్థ సీఈఓ విలియం స్కాట్‌కు పోలీసులు పలుమార్లు సమన్లు జారీ చేశారు. అయినప్పటికీ హాజరు కాకపోవడంతో 2013 మే 27న విలియం స్కాట్‌తో పాటు ఇద్దరు డెరైక్టర్లను అరెస్టు చేశారు. ఆ వెంటనే బెయిల్ లభించడంతో వారు విడుదలయ్యారు. అదే సంవత్సరం డిసెంబర్లో కర్నూలుకు చెందిన న్యాయవాది జగన్నాథ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు నగరంలోని రెండవ పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఆ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఢిల్లీలోని గుర్గావ్లో ఉన్న ఆమ్వే ప్రధాన కార్యాలయంలో విలియం స్కాట్‌ను అక్కడి పోలీసుల సహకారంతో సోమవారం అరెస్టు చేసి కర్నూలుకు తరలించారు. మంగళవారం జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి విలియంను విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం ఆయనను కర్నూలు జడ్జి సెలవులో ఉన్నందున డోన్ కోర్టులో హాజరుపర్చగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు. ఇన్నేళ్లుగా రాష్ట్ర సీఐడీ చేయలేని పనిని జిల్లా పోలీసులు చేసి చూపడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. -
ఆమ్వే ‘గొలుసు’ తెగిందా?
విశాఖపట్నం, న్యూస్‌లైన్: గొలుసు వ్యాపారంలో పేరొందిన ఆమ్వే సంస్థ మనుగడపై సందేహాలు రేకెత్తుతున్నాయి. ఈ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్కాట్ పింక్నీని ఒక చీటింగ్ కేసులో కర్నూలు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారన్న వార్తలు రావడంతో విశాఖలోని ఏజెంట్లు, వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా ఈ సంస్థపై పలు ఆరోపణలు రావడం, వాటిని సంస్థ ఖండిస్తూ వార్తా పత్రికలలో ప్రకటనలు ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంస్థ సీఈఓ అరెస్టు కావడంతో సంస్థ ఉంటుందా మూతపడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమ్వేకు జిల్లాలో వేలాది సంఖ్యలో ఏజెంట్లు ఉన్నారు. ప్రతినెలా రూ. కోట్లలో వ్యాపారం జరుగుతోంది. ఈ సంస్థ కార్యాలయం కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉంది. సంస్థ ఏజెంట్లు పలు రకాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా గొలుసుకట్టు విధానంలో సాగుతుంది. ప్రపంచంలోని 88 దేశాలలో డెరైక్ట్ సెల్లింగ్ బిజినెస్ విధానంలో ఆమ్వే సంస్థ పేరు ప్రఖ్యాతులు గడించింది. సంస్థ తరఫున 450 రకాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నారు. ఆమ్వే సంస్థ ఏజెంట్లలో పలువురు ప్రముఖులు, అధికారుల బంధువులు కూడా ఉన్నారు. ఆమ్వే ఉత్పత్తులను డెరైక్ట్ మార్కెటింగ్ పేరుతో విక్రయిస్తున్నా అధిక ధరలు ఉండడం పలువురిని ఆలోచింపజేస్తోంది.