గొలుసుకట్టు.. ఆటకట్టు | Amway corporation ceo arrested | Sakshi
Sakshi News home page

గొలుసుకట్టు.. ఆటకట్టు

Published Wed, May 28 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM

Amway corporation ceo arrested

సాక్షి, కర్నూలు : విదేశీ పెట్టుబడులకు దేశం ద్వారాలు తెరవడంతో 1995లో ఆమ్‌వే సంస్థ ఇండియన్ డెరైక్ట్ సెల్లింగ్ అసోసియేషన్(ఐడీఎస్‌ఏ) పేరిట తన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత ఉత్పత్తుల విక్రయం ముసుగులో గొలుసుకట్టు వ్యాపారానికి తెరతీసింది. అనతికాలంలోనే సంస్థ టర్నోవర్ 3 వేల కోట్లకు చేరుకోవడం గమనార్హం. సంస్థలో మొదట రూ.4,400 చెల్లించి ఏజెంట్‌గా
 సభ్యత్వం తీసుకున్న వ్యక్తి ఆరుగురిని సభ్యులుగా చేర్పించాల్సి ఉంటుంది. ఈ ఆరుగురు నలుగురిని.. ఆ నలుగురు మరో ముగ్గురిని 6-4-3 పద్ధతిని సంస్థలో భాగస్వాములను చేయాలనేది నిబంధన.

ఇలా 102 మంది సభ్యులతో గొలుసుకట్టు పూర్తయితే మొదటి వ్యక్తికి ప్రతి నెలా వ్యాపారంలో 3 శాతం సొమ్ము వస్తుంది. అలా తన కార్యకలాపాలపై సంస్థ విస్తృత ప్రాచుర్యం కల్పించింది. సభ్యులకు ఆమ్‌వే సంస్థ తమ ఉత్పత్తులకు సంబంధించిన ఒక కిట్ అందజేస్తుంది. గొలుసుకట్టు సభ్యులు రెండు వైపులా(లెఫ్ట్, రైట్) వ్యాపారం చేస్తేనే మొదటి వ్యక్తికి కమీషన్ ముడుతుంది. రూ.60 వేల వ్యాపారంలో 3 శాతం కమీషన్ చొప్పున రూ.1,500 అకౌంట్‌లో జమ అవుతుంది. వ్యాపారం బాగా చేసిన వ్యక్తులను సిల్వర్, గోల్డ్, ఎమరాల్డ్, ప్లాటినమ్, డైమండ్‌లుగా పరిగణిస్తారు. గొలుసుకట్టులో రెండు వైపులా రూ.6 లక్షల వ్యాపారం చేస్తే సిల్వర్ ర్యాంకు వస్తుంది. అలాకాకుండా ఒకవైపే బిజినెస్ జరిగితే మొదటి వ్యక్తికి వచ్చేది ఏమీ ఉండదు.

బిజినెస్ సరిగా చేయలేని సభ్యులను సంస్థ ప్రతినిధులు ఒత్తిడికి పాల్పడుతున్నట్లు కేరళకు చెందిన ఓ మహిళ 2011లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమ్‌వే కారణంగా తాను పెద్ద మొత్తంలో నష్టపోయినట్లు ఆమె పేర్కొంది. 2006లో మన రాష్ట్రంలోనూ సంస్థపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గొలుసుకట్టుతో ఆమ్‌వే అక్రమాలకు పాల్పడుతోందంటూ అదే ఏడాది హైదరాబాద్‌కు చెందిన అల్టూస్ సిస్టమ్స్ డెరైక్టర్ ఏవీఎస్ సత్యనారాయణ ఫిర్యాదు చేయడంతో సీఐడీ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, నిజామాబాద్, కర్నూలు, కాకినాడ, గుంటూరు, నెల్లూరు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి ఉత్పత్తులను సీజ్ చేశారు.

 ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో సంస్థపై కేసులు నమోదయ్యాయి. అప్పట్లో సంస్థ హైకోర్టులో రెండు రిట్ పిటిషన్లు దాఖలు చేసింది. విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం సంస్థ వ్యాపారం చట్టవిరుద్ధమని పేర్కొంటూ తీర్పునిచ్చింది. దీనిపై ఆమ్‌వే సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడా చుక్కెదురైంది. ఆమ్‌వే వ్యాపారంలో రాజకీయ దిగ్గజాలతో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు సీఐడీ పోలీసుల విచారణలో వెల్లడి కావడం ఆందోళన కలిగించే అంశం.

 న్యాయవాది ఫిర్యాదు: ఆమ్‌వే సంస్థ కొందరు డిస్టిబ్యూటర్లను బెదిరిస్తోందంటూ చేసిన ఫిర్యాదు మేరకు 2011లో కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి సంస్థ సీఈఓ విలియం స్కాట్‌కు పోలీసులు పలుమార్లు సమన్లు జారీ చేశారు. అయినప్పటికీ హాజరు కాకపోవడంతో 2013 మే 27న విలియం స్కాట్‌తో పాటు ఇద్దరు డెరైక్టర్లను అరెస్టు చేశారు. ఆ వెంటనే బెయిల్ లభించడంతో వారు విడుదలయ్యారు. అదే సంవత్సరం డిసెంబర్‌లో కర్నూలుకు చెందిన న్యాయవాది జగన్నాథ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు నగరంలోని రెండవ పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఆ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఢిల్లీలోని గుర్గావ్‌లో ఉన్న ఆమ్‌వే ప్రధాన కార్యాలయంలో విలియం స్కాట్‌ను అక్కడి పోలీసుల సహకారంతో సోమవారం అరెస్టు చేసి కర్నూలుకు తరలించారు. మంగళవారం జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి విలియంను విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం ఆయనను కర్నూలు జడ్జి సెలవులో ఉన్నందున డోన్ కోర్టులో హాజరుపర్చగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు. ఇన్నేళ్లుగా రాష్ట్ర సీఐడీ చేయలేని పనిని జిల్లా పోలీసులు చేసి చూపడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement