దుప్పలపల్లిలో విషాదం: పాడె మోసిన ఎంపీ కోమటిరెడ్డి | MPTC Couple Passes Away Sad Weather In Duppalapalli Village | Sakshi
Sakshi News home page

దుప్పలపల్లిలో విషాదం: పాడె మోసిన ఎంపీ కోమటిరెడ్డి

Published Thu, Sep 2 2021 10:27 AM | Last Updated on Thu, Sep 2 2021 10:49 AM

MPTC Couple Passes Away Sad Weather In Duppalapalli Village - Sakshi

రామగిరి (నల్లగొండ): తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్‌ శివారులో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో తానెదార్‌పల్లి ఎంపీటీసీ దంపతులు దొంతం కవిత, వేణుగోపాల్‌రెడ్డి దుర్మరణం చెందారు. వీరి మృతదేహాలను అంత్యక్రియల నిమిత్తం బుధవారం దుప్పలపల్లికి తీసుకువచ్చారు. దీంతో ఆ గ్రామంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి.

లారీని ఢీకొని
దొంతం కవిత, వేణుగోపాల్‌రెడ్డి హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నివాసం ఉంటున్నారు. వీరికి నల్ల గొండలో సొంత ఇల్లు కూడా ఉంది. రెండు రోజుల క్రితం సొంత పనుల నిమిత్తం వీరిద్దరూ నల్లగొండకు వచ్చారు. పనులు ముగించుకుని మంగళవారం రాత్రి 9.30 గంటలకు స్కార్పియో వాహనంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో సుమారు రాత్రి 11.45 గంటల ప్రాంతంతో ఔటర్‌ రింగ్‌రోడ్డు దాటాక పెద్దఅంబర్‌పేట సమీపంలో ఓ టిప్పర్‌ లారీ వర్షం పడుతున్న కారణంగా ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో వెనుక నుంచి వస్తున్న వీరి స్కార్పియో వాహనం లారీని ఢీకొట్టింది. దీంతో స్కార్పియో వాహనంలో ఉన్న దొంతం కవిత, వేణుగోపాల్‌రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం మృతదేహాలను పోలీసులు అంత్యక్రియల నిమిత్తం సొంత గ్రామమైన దుప్పలపల్లికి తీసుకువచ్చారు.



వివాహం జరిగి పదిరోజులు గడవకముందే..
ఎంపీటీసీ దంపతులకు కూతురు ప్రీతిరెడ్డి, కుమారుడు అజయ్‌కుమార్‌రెడ్డి ఇద్దరు సంతానం. కాగా.. ఆగస్టు 22వ తేదీన కుమార్తె ప్రీతిరెడ్డి వివాహం నల్లగొండలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కుమార్తె వివాహం అయి పదిరోజులు గడవకముందే తల్లిదండ్రులు ఇద్దరూ అకాల మరణం చెందారు. సెప్టెంబర్‌ 10, 11 కుమార్తె, అల్లుడిని తీసుకుని తిరుపతి వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు దుర్మరణం పాలయ్యారు. కాగా.. మంగళవారం తిరుపతిలో రూం కోసం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నుంచి లెటర్‌ కూడా తీసుకుని హైదరాబాద్‌కు బయలుదేరారు.

గ్రామస్తులతో విడదీయరాని అనుబంధం
వేణుగోపాల్‌రెడ్డిది రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి శ్రీనివాస్‌రెడ్డి మాజీ సర్పంచ్‌. వీరికి దుప్పలపల్లిలో వ్యవసాయ భూమి కూడా ఉంది. ప్రస్తుతం వేణుగోపాల్‌రెడ్డి రియల్‌ ఎస్టేట్‌తో పాటు బిల్డర్‌గా పని చేస్తున్నాడు. గ్రామస్తులతో వీరికి వీడదీయరాని అనుబంధం ఉంది. ఎంపీటీసీ దంపతుల మరణంతో దుప్పలపల్లిలో విషాదం నెలకొంది.

ప్రజాప్రతినిధుల నివాళి
అంత్యక్రియల్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొని తానే స్వయంగా పాడె మోశారు. దొంతం కవిత, వేణుగోపాల్‌రెడ్డి మృతదేహాలకు పలువురు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనిశెట్టి దుప్పలపల్లిలో శాసనమండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు దుబ్బాక నరసింహారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పల్‌రెడ్డి రవీందర్‌రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, వైస్‌ ఎంపీపీ ఏనుగు వెంకట్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్, డీసీసీబీ డైరెక్టర్‌ పాశం సంపత్‌రెడ్డి, లోడంగి గోవర్ధన్, వనపర్తి నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ జిల్లా అధికార ప్రతినిధి పాశం నరేష్‌రెడ్డిలు నివాళులర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement