ప్రమాద దృశ్యం
ముంబై : మనిషి జీవితంలో ఒకే సారి సంతోషం, బాధపడే సమయాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఆ టైంలో ఏం చేయాలో మనకు పాలుపోదు. ముంబైకి చెందిన రఫిఖీ షేక్ పరిస్థితి కూడా ఇప్పుడలాగే ఉంది. ముంబైలో అపార్ట్‌మెంట్ కూలిన ఘటనలో అతడు, అతడి కుమారుడు ప్రాణాలతో బయటపడ్డా.. సంతోషించలేని స్థితి.. ఎందుకంటే! ఇదే ఘటనలో అతడి కుటుంబసభ్యులు 9 మంది మృత్యువాతపడ్డారు. వివరాలు.. బుధవారం రాత్రి ముంబైలోని మలాద్‌లో రెండు అంతస్తుల అపార్టుమెంట్ భవనం రఫిఖీ ఇంటిపై కుప్ప కూలింది.
ఈ ఘటనలో ఎనిమిది మంది పిల్లలతో సహా 11 మంది మృతి చెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఈ ఘటన జరిగే ఓ నిమిషం ముందు అతడు పాల ప్యాకేట్ తేవటానికి బయటకు వెళ్లాడు. ఆ కొద్దిసేపటికే ఘోరం జరిగిపోయింది. ఇంటికి తిరిగి వచ్చి చూసిన అతడి గుండె బద్ధలైంది. భార్యా, తమ్ముడు, మరదలు, మరో ఆరుగురు పిల్లలు మొత్తం తొమ్మిది మంది కుటుంబసభ్యులు చనిపోయి ఉండటంతో కన్నీరు మున్నీరుగా విలపించాడు.
గుడ్డిలో మెల్లలాగా ఇక్కడ ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే.. 16 ఏళ్ల అతడి కుమారుడు కూడా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఏవో మందులు కొనటానికి అతడు బయటకు వెళ్లటంతో ప్రాణాలు దక్కాయి. దీనిపై రఫిఖీ మాట్లాడుతూ.. ‘‘ ఉదయం టీ చేయడానికి పాలకోసమని బయటకు వెళ్లాను. ఆ సమయంలోనే ప్రమాదం జరిగింది. ఆ బిల్డింగ్ పరిస్థితి బాగాలేదని నాకు తెలియదు. అంతా క్షణాల్లో జరిగిపోయింది.. నా ఫ్యామిలీ బయటకు వచ్చేంత సమయం కూడా దొరకలేదు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment