
సాక్షి, నల్లగొండ క్రైం: ప్రైవేట్ ఫైనాన్స్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గగులపల్లి మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన కొండేటి నాగయ్య (27) సొంతింటి నిర్మాణానికి మహేంద్ర ఫైనాన్స్ నుంచి ఏడాదిక్రితం రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. కరోనా కారణంగా అప్పు చెల్లించడంలో ఆలస్యమైంది.
ఫైనాన్స్‌కు సంబంధించిన ఏజెంట్లు ధర్మాపురం వచ్చి డబ్బులు చెల్లించకపోతే ఇంటికి తాళం వేస్తామని వేధించారు. దీనికితోడు నాగయ్య తెలిసినవారి వద్ద మరో రూ.2లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే చేరిసప అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. ఈ క్రమంలో భార్యాపిల్లలతో కలిసి మంగళవారం అత్తగారి గ్రామమైన నల్లగొండ మండలంలోని గుట్టకింద అన్నారం వచ్చాడు. ఆరోగ్యం బాగులేదని.. ఆస్పత్రిలో చూపించుకుంటానని నల్లగొండకు వచ్చిన నాగయ్య ముషంపల్లి రోడ్డులోని చర్చి వెనుకాల పురుగుల మందు తాగి బంధువులకు ఫోను చేసి చెప్పాడు. వెంటనే బంధువులు ఘటనస్థలానికి చేరుకుని 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు..
దేవరకొండ : ఆర్థిక ఇబ్బందులతో సైనెడ్ తాగి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం దేవరకొండలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం..పట్టణానికి చెందిన తంగెళ్లపల్లి ఆంజనేయులు దంపతుల రెండో కుమారుడు కోటయ్య(22) స్థానికంగా స్వర్ణకార దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యాయి. దీంతో జీవితంపై విరక్తి చెంది పట్టణంలోని పీర్లబావి సమీపంలోని గుట్టల్లో సైనెడ్ వాటర్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనస్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా, మృతుడు అవివాహితుడు.
Comments
Please login to add a commentAdd a comment