పోలీసులను బెదిరిస్తున్న నారా లోకేశ్
సాక్షి, అమరావతి/మంగళగిరి: టీడీపీ ఎమ్మెల్సీలు లోకేశ్, అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెనాలి శ్రావణ్‌కుమార్ విధి నిర్వహణలో ఉన్న రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సక్రూనాయక్‌పై హత్యాయత్నం చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఏకంగా టీడీపీ రాష్ట్ర కార్యాలయంలోని ఓ గదిలో ఆ పోలీసు అధికారిని బంధించి కులం పేరుతో దూషిస్తూ దాడికి తెగబడటం విస్మయం కలిగిస్తోంది.
చివరికి మంగళగిరి సీఐ వచ్చి ఆ అధికారిని విడిపించి ఆస్పత్రికి తీసుకెళ్లారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బాధిత రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకేశ్ ఏ1, అశోక్‌బాబు ఏ2, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఏ3, తెనాలి శ్రావణ్‌కుమార్ ఏ4గా, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, కులం పేరుతో దూషించడం, విధి నిర్వహణకు ఆటంకం కలిగించడం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ప్రకారం వివరాలివీ..
టీడీపీ ఆఫీసు వద్ద దాడిచేసి, బంధించి..
మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం వద్ద ఘర్షణలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో మంగళవారం సాయంత్రం మంగళగిరి బెటాలియన్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సక్రూనాయక్ వెంటనే అక్కడకు చేరుకున్నారు. విధి నిర్వహణ కోసం టీడీపీ ప్రధాన కార్యాలయం గేటు వద్దకు చేరుకున్న ఆయనపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. తాను పోలీసు అధికారినని చెబుతున్నా వినిపించుకోకుండా ఆయన్ని బలవంతంగా టీడీపీ కార్యాలయం లోపలికి తీసుకెళ్లి ఒక గదిలో బంధించారు. తరువాత టీడీపీ ఎమ్మెల్సీలు లోకేశ్, అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజా, శ్రావణ్ తదితరులు పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలతో ఆ గదిలోకి వచ్చారు. తాను పోలీసు అధికారినని చెబుతున్నా, తన గుర్తింపు కార్డు చూపించినా వారు పట్టించుకోలేదు.
అందరూ కలసి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సక్రూనాయక్‌పై తీవ్రంగా దాడిచేశారు. లంబాడి తెగకు చెందిన ఆయన్ని కులం పేరుతో దుర్భాషలాడారు. హత్యాయత్నం చేశారు. అశోక్‌బాబు ఆయన గుర్తింపు కార్డును లాక్కున్నారు. సెల్‌ఫోన్‌ను నేలకేసి కొట్టారు. మళ్లీ అందరూ కలసి మూకుమ్మడిగా ఆయనపై దాడిచేశారు. అతి కష్టం మీద అక్కడ నుంచి తప్పించుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన సక్రూనాయక్‌ను అశోక్‌బాబుతోపాటు పలువురు మళ్లీ పట్టుకుని బంధించారు. బలవంతంగా ప్రెస్‌మీట్‌లో కూర్చోబెట్టి ఆయనపై అసత్య ఆరోపణలు చేశారు.
అంత జరుగుతున్నా సరే ప్రాణభయంతో సక్రూనాయక్ మౌనంగా ఉండిపోయారు. ప్రెస్‌మీట్ అనంతరం ఆయన్ని మళ్లీ గదిలో బంధించారు. సమాచారం తెలుసుకున్న మంగళగిరి రూరల్ సీఐ భూషణం మంగళవారం రాత్రి 10.30 గంటలకు టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని ఆయన్ని విడిపించి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం సక్రూనాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేశ్, అశోక్‌బాబు, ఆలపాటి రాజా, శ్రావణ్‌కుమార్, పోతినేని శ్రీనివాసరావులతోపాటు మరికొందరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
టీడీపీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు
టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసులు బుధవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయానికి ఇరువైపులా అర కిలోమీటరు దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. టీడీపీ నాయకులను మాత్రమే అనుమతించారు. టీడీపీ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ లోకేశ్ పోలీసులను బెదిరించడం ఉద్రిక్తతలకు దారితీసింది. మంగళవారం దాడిలో గాయపడ్డారని చెబుతున్న కార్యకర్తలు కార్యాలయానికి వస్తుండగా వాహనాన్ని బెటాలియన్ వద్ద బందోబస్తులో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్ కార్యకర్తలతో తరలివచ్చి గాయపడినవారి అంబులెన్స్‌ను ఎందుకు వదలరని ప్రశ్నించడంతోపాటు అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు వేలు చూపిస్తూ బెదిరించారు. దీంతో విధుల్లో ఉన్న పోలీసులు విస్తుపోయారు.
వాహనాల రాకపోకలు అడ్డుకోవడంపై కేసు
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవిపై మంగళగిరి రూరల్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన వివాదంలో గంజి చిరంజీవితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి వాహనదారులను అడ్డుకుని ఇబ్బందులు కలిగించారు. జాతీయ రహదారులశాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంజి చిరంజీవితో పాటు మరికొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
70 మందిపై కేసు నమోదు
మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన ఘర్షణలకు సంబంధించి గుర్తుతెలియని 70 మందిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. తమ పార్టీ కార్యాలయంపై దాడిచేశారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగా.. టీడీపీ కార్యకర్తలు తమపై దాడికి పాల్పడ్డారని మరికొందరు కూడా ఫిర్యాదు చేశారు. ఈ వివాదంలో తమకు పలు ఫిర్యాదులు అందాయని, అన్నింటిపై సమగ్రంగా దర్యాప్తు జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంగళగిరి రూరల్ సీఐ భూషణం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment