
యువతిని ఇంటిలోకి రానివ్వని మామ, మోసగించిన నేవీ ఉద్యోగి మల్లేశ్వరరావు
సాక్షి, సంతబొమ్మాళి: ప్రేమ పేరుతో వెంటపడ్డాడు.. రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. వాంఛ తీరాక వదిలేసి వెళ్లిపోయాడు. ఓ నేవీ ఉద్యోగి చేసిన ఘనకార్యమిది. దీనిపై బాధితురాలు సాయిలీల పోలీసులను ఆశ్రయించింది. ఆమె తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని వడ్డివాడ గ్రామానికి చెందిన బైరి మల్లేశ్వరరావు విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డులో పనిచేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన తర్ర సాయిలీల వెంటపడి ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు. పార్కులు, సినిమాహాళ్ల తిప్పేవాడు. పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా.. విశాఖపట్నం తీసుకువెళ్లి 2020 జూలై15న రహస్యంగా వివాహం చేసుకున్నాడు.
అక్కడే ఓ లాడ్జిలో పది రోజుల పాటు ఇద్దరూ గడిపారు. అనంతరం యువతిని స్వగ్రామం వడ్డివాడలో వదిలేసి మల్లేశ్వరరావు డ్యూటీకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత యువతిని పట్టించుకోవడం మానేశాడు. ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో యువతి ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. అయినా అతడి వైఖరిలో మార్పు రాలేదు. విసిగిపోయిన ఆమె మంగళవారం మల్లేశ్వరరావు ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అత్తామామలు అడ్డుకోగా.. వారి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. దీంతో ఆమె సంత బొమ్మాళి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదు మేరకు మల్లేశ్వరరావు, అత్తామామలు, మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కామేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment