సుశాంత్‌ కోసం డ్రగ్స్‌ కొన్నా.. | NCB Grills Rhea For 6 hrs Questioning To Continue Tomorrow | Sakshi
Sakshi News home page

సుశాంత్‌ కోసం డ్రగ్స్‌ కొన్నా..

Published Mon, Sep 7 2020 1:28 AM | Last Updated on Mon, Sep 7 2020 9:25 AM

NCB Grills Rhea For 6 hrs Questioning To Continue Tomorrow - Sakshi

సుశాంత్‌ కేసులో డ్రగ్స్‌ కోణంపై విచారణకు ఆదివారం ముంబైలోని నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో కార్యాలయానికి వస్తున్న రియా చక్రవర్తి 

ముంబై: సినీ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో సీబీఐ, ఎన్‌సీబీ విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కి సంబంధించిన డ్రగ్స్‌ కేసులో అతని ప్రియురాలు, నటి రియా చక్రవర్తిని నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఆదివారం ఆరుగంటల పాటు విచారించింది. తిరిగి మరిన్ని వివరాలు రాబట్టేందుకు సోమ వారం కూడా విచారణకు హాజరుకావాల్సిందిగా రియాకు సమన్లు జారీచేసినట్టు ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ముత్తా అశోక్‌ జైన్‌ మీడియాకి వెల్లడించారు. సుశాంత్‌ సింగ్‌ కోసం తన సోదరుడు షోవిక్‌ చక్రవర్తి, మరో నిందితుడి ద్వారా తాను మాదకద్రవ్యాలను కొనుగోలు చేసేదానినని రియా అంగీకరించినట్టు తెలు స్తోంది. డ్రగ్స్‌ కొన్నానని, అయితే తానెప్పుడూ వాటిని వాడలేదని ఆమె చెప్పారు. రక్త నమూ నాలు ఇవ్వడానికి సిద్ధమని, ఎప్పుడూ డ్రగ్స్‌ వాడలేదని తెలిపారు. ఈ ఏడాది మార్చి 17న జైద్‌ నుంచి మాదకద్రవ్యాలు కొనుగోలు చేసేం దుకు మేనేజర్‌ మిరాండా వెళ్ళిన విషయం కూడా తనకు తెలుసునని ఎన్‌సీబీ ఎదుట రియా ఒప్పుకున్నారు. మార్చి 15న తన సోదరుడు షోవిక్‌కు, తనకు మధ్య మాదకద్రవ్యాలపై జరిగిన వాట్సాప్‌ చాట్‌ వాస్తవమేనని కూడా ఎన్‌సీబీ ఎదుట ఆమె అంగీకరించినట్టు సమా చారం. కాగా, రియా చక్రవర్తి విచారణ పూర్తి అయిన తరువాత, షోవిక్‌ చక్రవర్తి, సుశాంత్‌ హౌస్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరాండా, వ్యక్తిగత సహాయకుడు దీపేశ్‌ సావంత్‌లను రియాతో కూర్చోబెట్టి విడివిడిగా ఒక్కొక్కరి పాత్రపై వివరాలు సేకరిస్తామని ఎన్‌సీబీ తెలిపింది. తాజాగా అనూజ్‌ కేశ్వాని అనే వ్యక్తి ఇంటిపై ఎన్‌సీబీ దాడిచేసింది. ఈ దాడిలో 590 గ్రాముల హశీష్, 0.64 గ్రాముల ఎల్‌ఎస్‌డి షీట్స్, 304 గ్రాముల గంజాయి, 1,85,200 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై సీబీఐ, అతని అకౌంట్ల నుంచి కోట్ల రూపాయల డబ్బును బదలాయించారనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణను కూడా రియా ఎదుర్కొంటున్నారు. 

ప్రశ్నల వర్షం...
ఎన్‌సీబీ జాయింట్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే నేతృత్వంలోని ఎన్‌సీబీ బృందం, కొంత మంది మహిళా పోలీసులతో కలిసి ఆదివారం తెల్లవారు జామున పశ్చిమ శాంతా క్రజ్‌లోని రియా చక్రవర్తి ఇంటికి వెళ్ళి, ఆమెకు సమన్లు అంద జేసింది. పోలీసు ఎస్కార్ట్‌తో రియాను మధ్యాహ్నం 12 గంటలకు బల్లార్డ్‌ ఎస్టేట్‌లోని సంస్థ కార్యాలయానికి తీసుకొని వచ్చారు. ఆమె నుంచి ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈడీ ఇచ్చిన రిపోర్టుతో ఎన్‌సీబీ మాదక ద్రవ్యాల కోణంలో విచారణ ప్రారంభించింది. డ్రగ్స్‌ ముఠాతో రియాచక్రవర్తికి ఉన్న సంబంధాలపై ఎన్‌సీబీ అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ అనంతరం, రియా చక్ర వర్తి వివిధ టీవీ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తాను ఎప్పుడూ మాదక ద్రవ్యాలు సేవించలేదని చెప్పారు. సుశాంత్‌ సింగ్‌ గంజాయి తీసుకునే వాడని, ఇదే విషయాన్ని మిరాండా కూడా విచారణలో చెప్పినట్లు ఎన్‌సీబీ తెలిపింది. షోవిక్‌ ఆదేశాల మేరకు మిరాండా డ్రగ్స్‌ని సరఫరా చేసేవాడని ఎన్‌సీబీ వెల్లడించింది. ఇప్పటి వరకు 8 మంది నిందితులను అరెస్టు చేశారు. 2018 సెప్టెంబర్‌లో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ గంజాయి సేవిస్తున్నప్పుడు తాను చూశానని వ్యక్తిగత సలహాదారు దీపేశ్‌ సావంత్‌ అంగీకరించినట్టు ఎన్‌సీబీ అధికారులు వెల్లడించారు. మార్చి 13న రియా సోదరుడు షోవిక్‌ నుంచి డ్రగ్స్‌ తీసుకురావాలని సుశాంత్‌ చెప్పారని, అవి తీసుకొచ్చేందుకు మిరాండాతో కలిసి వెళ్ళానని దీపేశ్‌ చెప్పారు. అంతేకాకుండా ఏప్రిల్‌ 17న రియా చక్రవర్తి కోసం కూడా తాను డ్రగ్స్‌ సేకరించినట్లు దీపేశ్‌ ఎన్‌సీబీకి వెల్లడించారు.

ప్రేమించడమే నేరమా?
‘‘రియాచక్రవర్తి అరెస్టుకి సిద్ధంగా ఉన్నారు. ఎవరినైనా ప్రేమించడం నేరమైతే, తన ప్రేమ కోసం ఆమె ఎన్నికష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె అమాయకురాలు. ఆమెపై బీహార్‌ పోలీసులు, సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీలతో కలిసి పెట్టిన కేసుల్లో ముందస్తు బెయిలు కోసం రియా చక్రవర్తి ఏ కోర్టునీ ఆశ్రయించలేదు’’అని ఆమె న్యాయవాది సతీష్‌ మనేషిండే ట్వీట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement