చోరీ వివరాలను వెల్లడిస్తున్న మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి నేపాల్ గ్యాంగ్ దోపిడికి పాల్పడింది. సోమవారం రాత్రి రాయదుర్గం డీఎస్‌ఆర్ హిల్స్‌లో భారీగా నగదు చోరీ చేసిన ఈ గ్యాంగ్ బోర్‌వెల్ కాంట్రాక్టర్ గూడూరు మధుసుధన్‌రెడ్డి ఇంట్లో రూ.15 లక్షల నగదు, బంగారం చోరీ చేసింది. వాచ్‌మెన్, వంట మనుషులుగా పలు ఇళ్లలో చేరుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ ఇంటికే కన్నం వేసి దొంగతనానికి పాల్పడింది. ఈ దొంగతనం కూడా ఇంట్లో పని చేసే నేపాలీలా పనే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా మధుసూదన్ ఇంట్లో పని చేస్తున్న నేపాల్‌కు చెందిన మనోజ్, జానకి, రాజు, సీత నిన్న రాత్రి మధుసుధన్‌రెడ్డి భార్య తిన్న ఆహారంలో మత్తు మందు కలిపినట్లు తమ దర్యాప్తులో తేలిందని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. నిన్న రాత్రి శైలజరెడ్డి తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడంతో ఆమె తొందరగా స్పృహలోకి వచ్చి, ఈ ఘటనను రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించిందని తెలిపారు. చదవండి: నగరంలో నేపాలీ గ్యాంగ్
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్‌స్టాప్లు, ఎయిర్ పోర్ట్లు అప్రమత్తం చేశారని చెప్పారు. నిందితులు చాకచక్యంగా సీసీటీవీ, డీవీఆర్‌లు, కుటుంబ సభ్యుల సెల్ఫోన్లు సైతం ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో జరిగిన మూడు చోరీ ఘటనల్లో కోట్ల రూపాయలు కొట్టేశారు. జనవరిలో కోకాపేట్‌లోని ఓ ఇంట్లోవారికి మత్తు మందు ఇచ్చి కోటికి పైగా నగదు చోరీ చేసి పారిపోయారు. ఆగస్ట్‌లో సైనిన్‌పురిలో మరోసారి రెచ్చిపోయిన నేపాలి ముఠా.. పెళ్లికి వెళ్లి ఇంటికి చేరుకునే లోపు స్థిరాస్తి వ్యాపారి నరసింహారెడ్డి ఇంట్లో రూ.2కోట్ల విలువైన బంగారంతో పరారయ్యారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న తరుణంలోనే మరో మారోసారి ఈ గ్యాంగ్ మధుసుధన్‌రెడ్డి ఇంట్లో చోరీ చేసిందని పోలీసులు తెలిపారు. ఈ ముఠా ఆగడాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment