gang thieves
-
దడ పుట్టిస్తున్న ధార్ గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో మంగళవారం జరిగిన భారీ చోరీ మధ్యప్రదేశ్‌లోని ధార్ ముఠా పనిగా సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఒకేసారి నాలుగైదు ఇళ్లలో చోరీలకు పాల్పడటం ఈ గ్యాంగ్ స్టయిల్. దూలపల్లి హైటెన్షన్ లైన్‌లోని మహాలక్ష్మి ఎన్క్లేవ్ అగ్రి నివాస్‌లో అశోక్ రామ ఇంటితో పాటు అదే అపార్ట్మెంట్లోని 108, 203, 202 ఫ్లాట్లలోనూ దుండగులు చోరీకి యత్నించారు. ఈ క్లూ ఆధారంగానే ఈ చోరీ ధార్ గ్యాంగ్ పనేనని పోలీసులు నిర్ధారించారు. తెలంగాణలో 2018 నుంచి చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠాపై 98 కేసులుండగా.. వీటిలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 68 ఉండటం గమనార్హం. నెల రోజుల క్రితం ఈ గ్యాంగ్‌లోని ప్రధాన నిందితుడు మాన్‌సింగ్‌తో పాటు మొహబత్, రీమ్ సింగ్, కిషన్‌సింగ్‌లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితుల గుర్తింపు.. అగ్రి నివాస్ అపార్ట్మెంట్లో సీసీటీవీ కెమెరాలు లేకపోవటంతో.. ఆ రహదారిలోని సీసీటీవీ ఫుటేజీలను పేట్ బషీరాబాద్ పోలీసులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అపార్ట్‌మెంట్‌కు వెళ్లే దారిలోని రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. చోరీ జరిగిన ఇంట్లోని వేలిముద్రలు, ఇతరత్రా సాంకేతిక ఆధారాల మేరకు నలుగురు నిందితులు చోరీకి పాల్పడినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. చోరీ సొత్తుతో నిందితులు రాష్ట్రం దాటకుండా ముమ్మర గాలింపు చేస్తున్నామన్నారు. ఐటీ, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్), లా అండ్ ఆర్డర్ పోలీసులతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. (చదవండి: ఆమె జైలుకు.. బాలుడు ఇంటికి) -
దొంగల కుటుంబం: వారి టార్గెట్ అదే..
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): ఓ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరుగురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఓ సభ్యుడికి చెందిన ఆటోలో తిరుగుతూ బంగారం దుకాణాలను టార్గెట్‌గా చేసుకున్నారు. కస్టమర్లుగా నటిస్తూ వ్యాపారుల దృష్టి మళ్లించి బంగారం, వెండి ఆభరణాలు తస్కరిస్తున్నారు. నెల రోజుల్లో మూడు నేరాలు చేసిన ఈ ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారని ఓఎస్డీ రాధాకిషన్‌రావు సోమవారం తెలిపారు. ♦ప్రకాశం జిల్లాకు చెందిన వై.రేణుక, ఆమె సమీప బంధువులు ఎం.కిరణ్, వై.రాజు, అతడి భార్యలు తులసి, శ్వేత, మరో బంధువు రాణి 15 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చారు. ♦హయత్‌నగర్ ప్రాంతంలో స్థిరపడిన వీరు తొలినాళ్లల్లో చిన్నచిన్న పనులు చేసినా... ఆపై తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నేరాలు చేయాలని నిర్ణయించుకున్నారు. రేణుక నేతృత్వంలో వీరు ముఠా కట్టారు. ♦ఈ ఐదుగురూ కిరణ్‌కు చెందిన ఆటోలో నగరంలో తిరుగుతూ దారిలో కనిపించిన జ్యువెలరీ దుకాణాల్లో తమకు అనువుగా ఉన్న దాన్ని ఎంచుకుంటారు. ♦వినియోగదారుల మాదిరిగా అందులోకి ప్రవేశిస్తారు. ఒకరు నగలు, వస్తువులు చూపించాల్సిందిగా యజమానికి చెప్తారు. ఆయన ఆ పనిలో ఉండగా మిగిలిన వారు అతడి దృష్టి మళ్లించి చేతికి చిక్కిన బంగారు, వెండి వస్తువులు తస్కరిస్తారు. ♦వీటిని తమ వస్త్రాల లోపలి భాగాల్లో ప్రత్యేకంగా కుట్టించిన అరల్లో పెట్టుకుని ఆ దుకాణం నుంచి బయటకు వచ్చేస్తారు. ఆపై అంతా కలిసి తమ ఆటోలోనే ఉడాయిస్తారు. చోరీ సొత్తును విక్రయించి వచి్చన సొమ్ము పంచుకునేవారు. ♦ఇదే తరహాలో చిక్కడపల్లిలోని రామ్‌స్వరూప్ జ్యువెలర్స్ నుంచి 600 గ్రాముల వెండి ఆభరణాలు, నాచారంలోని ఓమ్‌సాయి జ్యువెలర్స్ నుంచి 50 తులాల వెండి ఆభరణాలు, తుకారామ్‌గేట్‌లోని త్రిషాల్ జ్యువెలర్స్ నుంచి 400 గ్రాముల వెండి తస్కరించారు. ♦తుకారాంగేట్ కేసును ఛేదించడానికి నార్త్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, జి.రాజశేఖర్‌రెడ్డి, బి.పరమేశ్వర్‌లతో కూడిన బృందం దర్యాప్తు చేసింది. ♦సోమవారం ఆరుగురినీ పట్టుకుని వీరి నుంచి ఆటోతో పాటు 1070 గ్రాముల వెండి ఆభరణాలు, సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకుంది. వీటి విలువ రూ.2.5 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నిందితుల్ని తుకారాంగేట్ పోలీసులకు అప్పగించింది. ♦ఈ ముఠాకు చెందిన రేణుకపై గతంలో వివిధ పోలీసుస్టేషన్లలో 13 కేసులు, కిరణ్‌పై 3, తులసిపై 8, శ్వేతపై 3, రాజుపై 2 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని పోలీసుస్టేషన్లలో వీళ్లు వాంటెడ్‌గా ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: కూకట్‌పల్లిలో పట్టుబడ్డ గంజదొంగ బంపరాఫర్.. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ -
హోసూరు దోపిడీ ముఠా.. హైదరాబాద్‌లో పట్టేశారు..
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. శంషాబాద్ తొండపల్లి వద్ద అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూర్ టౌన్ ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీకి పాల్పడిన ఈ గ్యాంగ్ నుంచి 25 కేజీల బంగారం, 7 తుపాకులు, బుల్లెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు నుంచి హైదరాబాద్, కర్ణాటకకు పారిపోయేందుకు దోపిడీదారులు ప్రయత్నించగా, సైబరాబాద్ పోలీసులకు వచ్చిన సమాచారంతో దోపిడీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. చదవండి: జైలు నుంచి విడుదలైన అఖిల ప్రియ సీపీ సజ్జనార్ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.‘‘తక్కువ సమయంలోనే దొంగలను పట్టుకున్నాం. నిందితుల చేతుల్లో వెపన్స్ ఉన్నాయి. 3 కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ బృందాలు సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అక్టోబర్‌లో లూథియానా, పంజాబ్ ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీ చేశారు. అప్పటి నుంచి నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారు. తొండపల్లి చెక్‌పోస్ట్ వద్ద నిందితులను అరెస్ట్ చేశాం. వారిని విచారించగా మరో కంటైనర్‌లో గోల్డ్, వెపన్స్ తరలిస్తున్నట్లు తెలిసింది. మేడ్చల్ వద్ద కంటైనర్‌ను పట్టుకున్నాం. నిందితులు మధ్యప్రదేశ్, జార్ఖండ్, యూపీలకు చెందినవారని’’ సీపీ తెలిపారు. చదవండి: ఆ ఇద్దరు సైకోలకు ఉరిశిక్షల వెనుక.. తెలంగాణ పోలీసులు అద్భుతంగా స్పందించారు.. దోపిడీ ముఠాను పట్టుకోవడంలో తెలంగాణ పోలీసులు అద్భుతంగా స్పందించారని కృష్ణగిరి జిల్లా(తమిళనాడు) ఎస్పీ బండి గంగాధర్ అన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ దాటుకుని తెలంగాణకు వచ్చారని.. ఈ గ్యాంగ్ చాలా ప్రమాదకరమైనదన్నారు. ఆయుధాలతో ఎదురు కాల్పులు జరిపే ప్రమాదం ఉందని, గతంలో లూథియానాలో ఈ గ్యాంగ్ చోరీ విఫలయత్నం అయినపుడు 32 రౌండ్లు కాల్పులు జరిపారని.. ఈ కాల్పులో ఒక వ్యక్తి కూడా మరణించాడని ఆయన వివరించారు. -
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఇంటికి వచ్చి
సాక్షి, నాగోలు: ఇన్‌స్టాగ్రామ్‌లో అయిన పరిచయంతో ఆకలవుతుందని ఇంటికి వచ్చి బంధించి సొత్తును దొంగిలించిన అంతర్రాష్ట్ర నేరస్తులను ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.26 లక్షల విలువ చేసే సామగ్రిని స్వాదీనం చేసుకున్నారు. సోమవారం ఎల్బీనగర్లో రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన నిఖిల్, వినయ్ చౌదరి, ఉదయ్ కుమార్, బ్రహ్మ తేజలు చిన్నానాటి స్నేహితులు. నలుగురూ నేరాల బాట పట్టారు. వనస్థలిపురంలో స్వచ్చంద హెల్ప్ కిడ్స్ హ్యాపీ కిడ్స్ అనే సంస్థ నడిపే సతీష్‌తో ఇన్‌స్ట్రాగామ్ లో పరిచయం పెంచుకున్న నిఖిల్ అతని ఆర్థిక లావాదేవీల గురించి తెలుసుకున్నాడు. చదవండి: మొన్న తమ్ముడు.. నేడు అన్న సతీష్ దగ్గర డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితులు బొమ్మ పిస్టల్ తీసుకొని వచ్చారు. ఈ నెల 15వ తేదీన వనస్థలిపురంలో నివాసముండే సతీష్ ఇంటికి నలుగురూ వచ్చారు. హఠాత్తుగా సతీష్‌పై దాడి చేసి నోరు మూసి తాడుతో చేతులు కట్టి బొమ్మ పిస్టల్‌తో బెదిరించి. నగదు. రూ.1.18 లక్షల నగదు, విదేశీ, కరెన్సీ, రెండు ల్యాప్‌టాప్‌లు, మూడు మొబైల్ ఫోన్లు, సిల్వర్ నెక్లెస్ దోపిడీ చేశారు. తరువాత బళ్లారికి పారిపోయారు. మళ్లీ నేరం చేసేందుకు సోమవారం శంషాబాద్‌కు వచ్చారు. నిందితులపై నిఘా ఉంచిన ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.26 విలువ చేసే వస్తువులను స్వాదీనంచేసుకున్నారు. -
మరోసారి నేపాల్ గ్యాంగ్ చోరీ
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి నేపాల్ గ్యాంగ్ దోపిడికి పాల్పడింది. సోమవారం రాత్రి రాయదుర్గం డీఎస్ఆర్ హిల్స్‌లో భారీగా నగదు చోరీ చేసిన ఈ గ్యాంగ్ బోర్వెల్ కాంట్రాక్టర్ గూడూరు మధుసుధన్‌రెడ్డి ఇంట్లో రూ.15 లక్షల నగదు, బంగారం చోరీ చేసింది. వాచ్మెన్, వంట మనుషులుగా పలు ఇళ్లలో చేరుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ ఇంటికే కన్నం వేసి దొంగతనానికి పాల్పడింది. ఈ దొంగతనం కూడా ఇంట్లో పని చేసే నేపాలీలా పనే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా మధుసూదన్ ఇంట్లో పని చేస్తున్న నేపాల్‌కు చెందిన మనోజ్, జానకి, రాజు, సీత నిన్న రాత్రి మధుసుధన్‌రెడ్డి భార్య తిన్న ఆహారంలో మత్తు మందు కలిపినట్లు తమ దర్యాప్తులో తేలిందని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. నిన్న రాత్రి శైలజరెడ్డి తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడంతో ఆమె తొందరగా స్పృహలోకి వచ్చి, ఈ ఘటనను రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించిందని తెలిపారు. చదవండి: నగరంలో నేపాలీ గ్యాంగ్ దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్‌స్టాప్‌లు, ఎయిర్ పోర్ట్‌లు అప్రమత్తం చేశారని చెప్పారు. నిందితులు చాకచక్యంగా సీసీటీవీ, డీవీఆర్లు, కుటుంబ సభ్యుల సెల్ఫోన్లు సైతం ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో జరిగిన మూడు చోరీ ఘటనల్లో కోట్ల రూపాయలు కొట్టేశారు. జనవరిలో కోకాపేట్‌లోని ఓ ఇంట్లోవారికి మత్తు మందు ఇచ్చి కోటికి పైగా నగదు చోరీ చేసి పారిపోయారు. ఆగస్ట్‌లో సైనిన్‌పురిలో మరోసారి రెచ్చిపోయిన నేపాలి ముఠా.. పెళ్లికి వెళ్లి ఇంటికి చేరుకునే లోపు స్థిరాస్తి వ్యాపారి నరసింహారెడ్డి ఇంట్లో రూ.2కోట్ల విలువైన బంగారంతో పరారయ్యారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న తరుణంలోనే మరో మారోసారి ఈ గ్యాంగ్ మధుసుధన్‌రెడ్డి ఇంట్లో చోరీ చేసిందని పోలీసులు తెలిపారు. ఈ ముఠా ఆగడాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
పల్లెల్లో దొంగల కలవరం
పాకాల : మండలంలోని మొగరాల పంచాయతీ పచ్చిపాలపల్లెలో గురువారం రాత్రి 12 గంటల ప్రాతంలో దొంగలు హల్ చల్ చేశారు. స్థానికులు శుక్రవారం తెలిపిన వివరాల మేరకు వివరాలివి. రెండు ద్విచక్ర వాహనాల్లో ముగ్గురు వ్యక్తులు గ్రామంలోని ట్యాంక్ వద్దకు వచ్చి చుట్టుపక్కల ప్రదేశాలను పరిశీలించారు. గమనించిన గ్రామస్తులు కేకలు వేయడంతో ముగ్గురు దొంగలు వచ్చిన బైక్‌ల్లోనే పరారయ్యారని తెలిపారు. మేము గమనించకుంటే ఏదో ప్రమాదం జరిగి ఉండేదని గ్రామస్తులు ఆందోళనగా చెప్పారు. శుక్రవారం ఉదయం కూడా ప్లాస్టిక్ బిందెలు విక్రయిస్తున్నట్లు ఓ వ్యక్తి అదే గ్రామానికి వెళ్లాడు. ఓ మహిళ బిందెలు కొనడానికి అతన్ని పిలిచింది. ఆ వ్యక్తి బందెలు అమ్మకుండా చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తూ గ్రామం నుంచి ఊడాయించాడని సమాచారం. ప్రస్తుతం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాల్లో పార్థీ గ్యాంగ్ దొంగల ముఠాపై ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. దీనికి తోడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే చుట్టు పక్కలే పార్థీ గ్యాంగ్ ఉందేమోనని అనుమానిస్తున్నారు. పోలీసులు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గస్తీ నిర్వహించి ప్రజలకు ధైర్యాన్ని కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. దొంగలతో ఇలాంటి సమస్యలు ఎదురయినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా తెలియజేసి అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
కర్నూలులో చెడ్డీ గ్యాంగ్ హల్చల్
కర్నూలు: కర్నూలు నగరంలోనూ చెడ్డి గ్యాంగ్ హల్చల్ చేసింది. హైదరాబాద్ తరహాలో దోపిడీలకు తెగబడింది. స్థానిక న్యూ కృష్ణా నగర్, ఆదిత్యనగర్, విఠల్ నగర్లలో చోరీలకు పాల్పడింది. మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడి ఓ ఇంటికి నిప్పు పెట్టారు. నాలుగో ఇంట్లో చోరీకి వెళ్లడంతో స్థానికులు గుర్తించారు. బనియన్, చెడ్డీలు వేసుకున్న 25 ఏళ్ల యువకులు ఈ ముఠాలో ఉన్నట్టు వారు చెబుతున్నారు. స్థానికులు గుర్తించడంతో దొంగలు పరారయ్యారు. మగ్మములు, మహమ్మద్ ఇళ్లలో చోరీ జరిగింది. అయితే పోయిన సొమ్ము ఎంతనేది తెలియరాలేదు. -
నలుగురు సభ్యుల దొంగల ముఠా అరెస్టు
ఏటీఅగ్రహారం (గుంటూరు), న్యూస్‌లైన్: ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన నలుగురు సభ్యుల ముఠాను నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద చోరీ సొత్తు రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నరసరావుపేట పట్టణం శ్రీరామ్‌పురానికి చెందిన మార్తి రాంబాబు తన బంధువు మృతిచెందడంతో గత నవంబరు 26వ తేదీ రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతోసహా నెల్లూరు వెళ్లారు. మరుసటి రోజు ఇంటికి చేరుకునే సమయానికి వస్తువలన్నీ చిందరవందరంగా పడి ఉన్నాయి. రూ.10 లక్షల విలువ చేసే 33.4 సవర్ల బంగారు ఆభరణాలు, 1.8 కేజీల వెండి వస్తువులను అపహరించినట్లు గుర్తించారు. ఈ మేరకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి డీఎస్పీ డి.ప్రసాద్ నేతృత్వంలో సీఐ ఎం.వి.సుబ్బారావు, సిబ్బంది దర్యాప్తు నిర్వహించారు. నరసరావుపేట పట్టణం వరవకట్టకు చెందిన షేక్ కరీముల్లా, షేక్ ఖాశిం, షేక్ నాగూర్, షేక్ జిలానీలపై అనుమానం రావడంతో ఆ దిశగా దర్యాప్తు జరిపారు. ఈ నలుగురు కలిసి ఓ ముఠా ఏర్పడి చోరీకి పాల్పడినట్లు వెల్లడైంది. శనివారం నిందితులను అరెస్టు చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారు. వీరిలో కరీముల్లా గతంలో బ్యాటరీల దొంగతనం కేసుల్లో నిందితుడు. వీరికి ఇతర నేరాలతో సంబంధం ఉందా అనే విషయమై విచారణ జరుపుతున్నట్లు రూరల్ ఎస్పీ తెలిపారు. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవడంలో సమయస్ఫూర్తి చూపిన కానిస్టేబుల్ అనిల్‌కుమార్, హోంగార్డులు షేక్ సైదా, సాంబశివరావు, జానీలను ఎస్పీ అభినందించారు. సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ బి.ప్రసాద్, సీఐ ఎం.వి.సుబ్బారావు పాల్గొన్నారు. రెండు గ్యాంగ్‌ల గుర్తింపు.. జిల్లాలో నేరాలకు, చోరీలకు పాల్పడిన రెండు గ్యాంగ్‌లను గుర్తించామని, ముఠా సభ్యులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని రూరల్ జిల్లా ఎస్పీ సత్యనారాయణ తెలిపారు. పెదకూరపాడు మండలం కంభంపాడులోని డీలరు సాంబశివరావును విజిలెన్స్ అధికారులమంటూ బెదిరించిన ఐదుగురు నిందితులైన షేక్ యాసిన్, శ్రీనివాసరెడ్డి, జాని, రవి, కరీముల్లాలపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పిడుగురాళ్ళ రూరల్ పరిధిలోని గుప్త నిధుల తవ్వకాల సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటికే ఒకరిపై చర్యలు చేపట్టామని చెప్పారు. సముద్ర తీరంలో నిఘాను పెంచి గస్తీ కొనసాగిస్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం త్వరలోనే మూడేళ్లుపైగా జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సీఐలను, సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐలను, సొంత మండలంలోనే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లను బదిలీ చేసేందుకు నివేదికలు రూపొందిస్తున్నామని ఎస్పీ వివరించారు.