నలుగురు సభ్యుల దొంగల ముఠా అరెస్టు
Published Sun, Jan 26 2014 1:19 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
ఏటీఅగ్రహారం (గుంటూరు), న్యూస్‌లైన్: ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన నలుగురు సభ్యుల ముఠాను నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద చోరీ సొత్తు రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నరసరావుపేట పట్టణం శ్రీరామ్‌పురానికి చెందిన మార్తి రాంబాబు తన బంధువు మృతిచెందడంతో గత నవంబరు 26వ తేదీ రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతోసహా నెల్లూరు వెళ్లారు. మరుసటి రోజు ఇంటికి చేరుకునే సమయానికి వస్తువలన్నీ చిందరవందరంగా పడి ఉన్నాయి. రూ.10 లక్షల విలువ చేసే 33.4 సవర్ల బంగారు ఆభరణాలు, 1.8 కేజీల వెండి వస్తువులను అపహరించినట్లు గుర్తించారు. ఈ మేరకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి డీఎస్పీ డి.ప్రసాద్ నేతృత్వంలో సీఐ ఎం.వి.సుబ్బారావు, సిబ్బంది దర్యాప్తు నిర్వహించారు.
నరసరావుపేట పట్టణం వరవకట్టకు చెందిన షేక్ కరీముల్లా, షేక్ ఖాశిం, షేక్ నాగూర్, షేక్ జిలానీలపై అనుమానం రావడంతో ఆ దిశగా దర్యాప్తు జరిపారు. ఈ నలుగురు కలిసి ఓ ముఠా ఏర్పడి చోరీకి పాల్పడినట్లు వెల్లడైంది. శనివారం నిందితులను అరెస్టు చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారు. వీరిలో కరీముల్లా గతంలో బ్యాటరీల దొంగతనం కేసుల్లో నిందితుడు. వీరికి ఇతర నేరాలతో సంబంధం ఉందా అనే విషయమై విచారణ జరుపుతున్నట్లు రూరల్ ఎస్పీ తెలిపారు. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవడంలో సమయస్ఫూర్తి చూపిన కానిస్టేబుల్ అనిల్‌కుమార్, హోంగార్డులు షేక్ సైదా, సాంబశివరావు, జానీలను ఎస్పీ అభినందించారు. సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ బి.ప్రసాద్, సీఐ ఎం.వి.సుబ్బారావు పాల్గొన్నారు.
రెండు గ్యాంగ్‌ల గుర్తింపు..
జిల్లాలో నేరాలకు, చోరీలకు పాల్పడిన రెండు గ్యాంగ్‌లను గుర్తించామని, ముఠా సభ్యులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని రూరల్ జిల్లా ఎస్పీ సత్యనారాయణ తెలిపారు. పెదకూరపాడు మండలం కంభంపాడులోని డీలరు సాంబశివరావును విజిలెన్స్ అధికారులమంటూ బెదిరించిన ఐదుగురు నిందితులైన షేక్ యాసిన్, శ్రీనివాసరెడ్డి, జాని, రవి, కరీముల్లాలపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పిడుగురాళ్ళ రూరల్ పరిధిలోని గుప్త నిధుల తవ్వకాల సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటికే ఒకరిపై చర్యలు చేపట్టామని చెప్పారు. సముద్ర తీరంలో నిఘాను పెంచి గస్తీ కొనసాగిస్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం త్వరలోనే మూడేళ్లుపైగా జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సీఐలను, సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐలను, సొంత మండలంలోనే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లను బదిలీ చేసేందుకు నివేదికలు రూపొందిస్తున్నామని ఎస్పీ వివరించారు.
Advertisement