
పాకాల : మండలంలోని మొగరాల పంచాయతీ పచ్చిపాలపల్లెలో గురువారం రాత్రి 12 గంటల ప్రాతంలో దొంగలు హల్ చల్ చేశారు. స్థానికులు శుక్రవారం తెలిపిన వివరాల మేరకు వివరాలివి. రెండు ద్విచక్ర వాహనాల్లో ముగ్గురు వ్యక్తులు గ్రామంలోని ట్యాంక్ వద్దకు వచ్చి చుట్టుపక్కల ప్రదేశాలను పరిశీలించారు. గమనించిన గ్రామస్తులు కేకలు వేయడంతో ముగ్గురు దొంగలు వచ్చిన బైక్‌ల్లోనే పరారయ్యారని తెలిపారు. మేము గమనించకుంటే ఏదో ప్రమాదం జరిగి ఉండేదని గ్రామస్తులు ఆందోళనగా చెప్పారు.
శుక్రవారం ఉదయం కూడా ప్లాస్టిక్ బిందెలు విక్రయిస్తున్నట్లు ఓ వ్యక్తి అదే గ్రామానికి వెళ్లాడు. ఓ మహిళ బిందెలు కొనడానికి అతన్ని పిలిచింది. ఆ వ్యక్తి బందెలు అమ్మకుండా చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తూ గ్రామం నుంచి ఊడాయించాడని సమాచారం. ప్రస్తుతం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాల్లో పార్థీ గ్యాంగ్ దొంగల ముఠాపై ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. దీనికి తోడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే చుట్టు పక్కలే పార్థీ గ్యాంగ్ ఉందేమోనని అనుమానిస్తున్నారు. పోలీసులు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గస్తీ నిర్వహించి ప్రజలకు ధైర్యాన్ని కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. దొంగలతో ఇలాంటి సమస్యలు ఎదురయినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా తెలియజేసి అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment