Hyderabad Today Road Accident: Nepali Wife And Husband Dead In Road Accident Hyderabad - Sakshi
Sakshi News home page

విషాదం: కాసేపట్లో ఇంటికి చేరతామనగా

Feb 23 2021 8:05 AM | Updated on Feb 23 2021 11:33 AM

Nepali Wife And Husband Last Breath In Hyderabad Road Accident - Sakshi

రూమ్‌లాల్‌ బండారి, మీనాదేవి (ఫైల్‌)రూమ్‌లాల్‌ బండారి, మీనాదేవి (ఫైల్‌)

నేపాల్‌లోని డాంగ్‌ జిల్లా పప్పారి గ్రామానికి చెందిన రూమ్‌లాల్‌ బండారి (40) మీనాదేవి బండారి (35) ఏడేళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. వీరి బంధువు బలరామ్‌ సునార్‌ సైతం వీరితో కలిసే ఉంటున్నాడు. అల్వాల్‌ ప్రాంతంలోని దేవుని అల్వాల్‌ శివాలయం రోడ్డులో స్థిరపడిన ఈ ముగ్గురూ స్థానికంగా పాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నడుపుతున్నారు.

సాక్షి, అల్వాల్‌: మద్యం మత్తులో ఉన్న టిప్పర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం పొట్ట కూటి కోసం పరాయి దేశం నుంచి వచ్చిన భార్యాభర్తల ఉసురుతీసింది. రోజంతా శ్రమించిన ఆ జంట రెండు నిమిషాల్లో ఇంటికి చేరతామనగా అర్ధంతరంగా తనువు చాలించింది. హృదయ విదారకమైన ఈ ఘటన ఆదివారం రాత్రి అల్వాల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. నేపాల్‌లోని డాంగ్‌ జిల్లా పప్పారి గ్రామానికి చెందిన రూమ్‌లాల్‌ బండారి (40) మీనాదేవి బండారి (35) ఏడేళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. వీరి బంధువు బలరామ్‌ సునార్‌ సైతం వీరితో కలిసే ఉంటున్నాడు. అల్వాల్‌ ప్రాంతంలోని దేవుని అల్వాల్‌ శివాలయం రోడ్డులో స్థిరపడిన ఈ ముగ్గురూ స్థానికంగా పాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నడుపుతున్నారు.

గత ఏడాది లాక్‌డౌన్‌లో వీరి వ్యాపారం మూతపడగా.. కొన్ని నెలలు స్వదేశానికి వెళ్లిపోయారు. ఇటీవలే తమ ఇద్దరు పిల్లల్ని తన తల్లిదండ్రుల వద్ద విడిచిపెట్టిన రూమ్‌లాల్‌ భార్య, బంధువుతో కలిసి తిరిగి అల్వాల్‌ వచ్చాడు. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తన వ్యాపారం ముగించుకున్న ముగ్గురూ నడుచుకుంటూ ఇంటికి తిరిగి వెళ్తున్నారు. దేవుని అల్వాల్‌ శివాలయం రోడ్డు మూల మలుపు వద్దకు వచ్చిన వీరిని వెనక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్‌ అదుపు తప్పి వీరిపైకి దూసుకొచ్చింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. కాస్త దూరంగా ఉన్న వీరి బంధువు మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరతారనగా ప్రమాదం బారినడపటం, స్వదేశంలోని వీరి పిల్లలు అనాథలు కావడంతో ఇక్కడి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ టిప్పర్‌ను నిర్లక్ష్యంగా నడిపాడని, మలుపు వద్ద ఎదురుగా వచ్చిన ప్యాసింజర్‌ ఆటోను తప్పించే ప్రయత్నం చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే సడన్‌ బ్రేక్‌ వేయడం, లారీలో సగం మొరం లోడు ఉండటంతో అదుపుతప్పి ఎడమ వైపునకు పడిపోయిందని వివరిస్తున్నారు. ఫలితంగా రోడ్డు పక్కగా నడిచి వెళ్తున్న భార్యాభర్తలు మృత్యువాతపడ్డారని పేర్కొంటున్నారు. కేసు నమోదు చేసుకున్న అల్వాల్‌ పోలీసులు ఈసీఐఎల్‌లోని అశోక్‌నగర్‌కు చెందిన టిప్పర్‌ డ్రైవర్‌ కె.నర్సింహ్మను (59) అదుపులోకి తీసుకున్నారు. ఇతడికి డ్రంక్‌ డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించగా బీఏసీ కౌంట్‌ 165గా వచ్చింది. వయోభారంతో ఉన్న ఇతడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ వివరాలను ఆరా తీయాలని అధికారులు నిర్ణయించారు. నర్సింహ్మను అరెస్టు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి:
తుపాకీ గురిపెట్టి..  కత్తితో బెదిరించి 
స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్లపై ఎక్కువ సేపు కరోనా!

1
1/1

ప్రమాదానికి కారణమైన టిప్పర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement