వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. స్వగ్రామంలోనే ఉంటూ ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంతలోనే వారి మధ్య నెలకొన్న చిన్నపాటి వివాదం పెను విషాదం మిగిల్చింది. ఆత్మహత్యకు దారి తీసింది. కొత్తకోటలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.
విశాఖపట్నం: మండలంలోని కొత్తకోట గ్రామానికి చెందిన దాసరి ప్రవీణ్‌కుమార్ (22), మరిశా అపర్ణ(20) ప్రేమించుకున్నారు. పెద్దలకు తెలియకుండా ఆరు నెలల క్రితం విజయవాడ చర్చిలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కొత్తకోటలోనే ఉంటూ స్థానికంగా ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. ఇంతలోనే ఐదు రోజుల క్రితం వారి మధ్య నెలకొన్న చిన్న వివాదంతో అపర్ణ పురుగు మందు తాగింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. ఆత్మహత్యగా కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె మరణాన్ని తట్టుకోలేని భర్త ప్రవీణ్‌కుమార్ మంగళవారం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ యువ జంట మరణం ఈ ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది. అందివచ్చిన పిల్లలు దూరం కావడంతో ఇరు కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
విధిని ఎదిరించలేక..
దాసరి ప్రవీణ్‌కుమార్, మరిశా అపర్ణను ఏడాదిగా ఇష్టపడుతున్నాడు. అయితే అపర్ణ తల్లిదండ్రులు అపర్ణకు వేరొక సంబంధం చూస్తుండటంతో ఆమె ఇంటికి వెళ్లి మరీ అపర్ణంటే తనకు ఇష్టమని, వేరే పెళ్లి చేయవద్దని అతను అడ్డుకునేవాడు. తరచూ ఇలా చేస్తుండటంతో అపర్ణ తల్లిదండ్రులు పోలీసులకు ఎనిమిది నెలల క్రితం ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్‌ఐ నాగకార్తీక్ ప్రవీణ్‌కుమార్‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే ఆ తరువాత ఇద్దరూ ఇంటి నుంచి విజయవాడ వెళ్లి చర్చిలో వివాహం చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి స్వగ్రామానికి వచ్చి పెద్దల నుంచి రక్షణ కల్పించాలని కొత్తకోట పోలీసులను ఆశ్రయించారు. వారి చొరవతో సమస్య చాలా వరకు పరిష్కారమైంది. అంతవరకు యువ జంట కొన్నాళ్లు విడిగా ఉండేవారు. ఆ తర్వాత పెద్దలతో కలిసే ఉంటూ గ్రామంలోని ఒక పెద్ద వస్త్రదుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం మద్యం సేవించిన ప్రవీణ్‌కుమార్ దుకాణంలో భార్య అపర్ణతో గొడవ పడ్డాడు. చేయిచేసుకోవడంతో ఇది సరికాదంటూ దుకాణ యజమాని మందలించాడు. దీంతో తీవ్రంగా కలత చెందిన అపర్ణ ఇంటికి వెళ్లి పురుగుమందు తాగింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె మరణాన్ని తట్టుకోలేని ప్రవీణ్‌కుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చితి నుంచి పోస్టుమార్టంకు:
ప్రవీణ్‌కుమార్ మృతదేహాన్ని ఆతని కుటుంబీకులు శ్మశానవాటికకు తరలించి అంత్య క్రియలకు సిద్ధపడుతున్నారు. ఇంతలో కొత్తకోట ఎస్‌ఐ అప్పలనాయుడు, ఏఎస్‌ఐ బాలాజి సిబ్బంది వచ్చి అడ్డుకున్నారు. ప్రవీణ్‌కుమార్ చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతున్న ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో వారు కేసు నమోదు చేశారు. మృతదేహానికి చితి వద్దే పంచనామా నిర్వహించి, అంబులెన్సులో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment