newly married couple committed suicide
-
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. నవ దంపతుల ఆత్మహత్య
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుడిహత్నూర్ మండలంలోని కొల్హరి గ్రామానికి చెందిన దంపతులు విజయ్, పల్లవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు..మహారాష్ట్రకు చెందిన పల్లవికి కొల్హారి గ్రామానికి విజయ్‌కు గత మే నెలలో వివాహం జరిగింది. సంక్రాంతికి పుట్టింటికి వెళ్ళి వచ్చిన పల్లవి.. శుక్రవారం మధ్యాహ్నం అత్తగారి ఇంటికి వచ్చింది. సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పల్లవి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.. దీంతో తనపై అపవాదు వస్తుందన్న భయంతో ఆమె భర్త విజయ్ శ్మశాన వాటికకు వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నవ దంపతుల ఆత్మహత్య
అనంతపురం: నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని మండలంలోని గంగంపల్లిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ జనార్దన్ నాయుడు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన దూదేకుల దాదాఖలందర్ (24), బోయ జ్యోత్స (20) రెండు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ, ఇద్దరూ ఇంట్లో బుధవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ జనార్దన్ నాయుడు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. -
చిన్నపాటి వివాదం యువజంట బలవన్మరణం
వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. స్వగ్రామంలోనే ఉంటూ ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంతలోనే వారి మధ్య నెలకొన్న చిన్నపాటి వివాదం పెను విషాదం మిగిల్చింది. ఆత్మహత్యకు దారి తీసింది. కొత్తకోటలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. విశాఖపట్నం: మండలంలోని కొత్తకోట గ్రామానికి చెందిన దాసరి ప్రవీణ్‌కుమార్ (22), మరిశా అపర్ణ(20) ప్రేమించుకున్నారు. పెద్దలకు తెలియకుండా ఆరు నెలల క్రితం విజయవాడ చర్చిలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కొత్తకోటలోనే ఉంటూ స్థానికంగా ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. ఇంతలోనే ఐదు రోజుల క్రితం వారి మధ్య నెలకొన్న చిన్న వివాదంతో అపర్ణ పురుగు మందు తాగింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. ఆత్మహత్యగా కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె మరణాన్ని తట్టుకోలేని భర్త ప్రవీణ్‌కుమార్ మంగళవారం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ యువ జంట మరణం ఈ ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది. అందివచ్చిన పిల్లలు దూరం కావడంతో ఇరు కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విధిని ఎదిరించలేక.. దాసరి ప్రవీణ్‌కుమార్, మరిశా అపర్ణను ఏడాదిగా ఇష్టపడుతున్నాడు. అయితే అపర్ణ తల్లిదండ్రులు అపర్ణకు వేరొక సంబంధం చూస్తుండటంతో ఆమె ఇంటికి వెళ్లి మరీ అపర్ణంటే తనకు ఇష్టమని, వేరే పెళ్లి చేయవద్దని అతను అడ్డుకునేవాడు. తరచూ ఇలా చేస్తుండటంతో అపర్ణ తల్లిదండ్రులు పోలీసులకు ఎనిమిది నెలల క్రితం ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్ఐ నాగకార్తీక్ ప్రవీణ్‌కుమార్‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే ఆ తరువాత ఇద్దరూ ఇంటి నుంచి విజయవాడ వెళ్లి చర్చిలో వివాహం చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి స్వగ్రామానికి వచ్చి పెద్దల నుంచి రక్షణ కల్పించాలని కొత్తకోట పోలీసులను ఆశ్రయించారు. వారి చొరవతో సమస్య చాలా వరకు పరిష్కారమైంది. అంతవరకు యువ జంట కొన్నాళ్లు విడిగా ఉండేవారు. ఆ తర్వాత పెద్దలతో కలిసే ఉంటూ గ్రామంలోని ఒక పెద్ద వస్త్రదుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం మద్యం సేవించిన ప్రవీణ్‌కుమార్ దుకాణంలో భార్య అపర్ణతో గొడవ పడ్డాడు. చేయిచేసుకోవడంతో ఇది సరికాదంటూ దుకాణ యజమాని మందలించాడు. దీంతో తీవ్రంగా కలత చెందిన అపర్ణ ఇంటికి వెళ్లి పురుగుమందు తాగింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె మరణాన్ని తట్టుకోలేని ప్రవీణ్‌కుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చితి నుంచి పోస్టుమార్టంకు: ప్రవీణ్‌కుమార్ మృతదేహాన్ని ఆతని కుటుంబీకులు శ్మశానవాటికకు తరలించి అంత్య క్రియలకు సిద్ధపడుతున్నారు. ఇంతలో కొత్తకోట ఎస్ఐ అప్పలనాయుడు, ఏఎస్ఐ బాలాజి సిబ్బంది వచ్చి అడ్డుకున్నారు. ప్రవీణ్‌కుమార్ చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతున్న ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో వారు కేసు నమోదు చేశారు. మృతదేహానికి చితి వద్దే పంచనామా నిర్వహించి, అంబులెన్సులో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
చిరునవ్వుతో భర్తకు ఎదురెళ్లింది.. ఏమైందో తెలియదు.. కొద్ది నిమిషాల్లోనే..
పెళ్లి ముచ్చట తీరనేలేదు.. ఇంటిముంగిట కట్టిన తోరణాలు తొలగనేలేదు.. అన్యోన్యంగా జీవించే నవదంపతులు క్షణికావేశానికి గురయ్యారు. ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకరితర్వాత ఒకరు మృత్యుఒడికి చేరుకున్నారు. ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపారు. సాక్షి, కొత్తవలస (విజయనగరం): జీవనోపాధికోసం బైక్‌పై బయలుదేరిన భర్తకు చిరునవ్వుతో ఎదురెళ్లిన భార్య.. ఏమైందో తెలియదు.. కొద్ది నిమిషాల్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని తనువు చాలించింది. ఈ వార్త తెలుసుకున్న భర్త సైతం భార్య మార్గంలోనే మృత్యుఒడికి చేరుకున్న విషాదకర ఘటన కొత్తవలస మండలం చీపురువలస గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తవలస మండలం చీపురువలస గ్రామానికి చెందిన కర్రి రాము (30) జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. రాము తల్లి ఈశ్వరమ్మ అనారోగ్యంతో మృతిచెందడంతో తండ్రి అప్పారావు, చెల్లి కనకలు, బావ అప్పారావు కలిసి ఒకే ఇంటిలో నివసిస్తున్నారు. ఈ ఏడాది జూలై 1న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన కొండల వెంకటహేమదుర్గ(29)తో రాము వివాహం జరిగింది. ఇద్దరూ అన్యోన్యంగానే జీవించేవారు. కూలి పనులు చేసుకుంటూ ఉన్నంతంలో సర్దుకుపోతూ ఆనందంగా గడిపేవారు. ఈ జంటను చూసి గ్రామస్తులు ముచ్చటపడ్డారు. శనివారం ఉదయం 9 గంటల సమయంలో భర్తతో పాటు ఆడపడుచు భర్త అప్పారావు బైక్‌పై విధులకు వెళ్లే సమయంలో హేమదుర్గ చిరునవ్వుతో ఎదురొచ్చింది. అనంతరం మేడపైకి వెళ్లి ఎంతసేపటికీ కిందకి రాకపోవడంతో పిలిచేందుకు ఆడపడుచు వెళ్లింది. అప్పటికే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండడాన్ని గమనించింది. ఇరురుపొరుగువారిని పిలిచి వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. చదవండి: (విషాదం: పెళ్లి విషయంలో ధైర్యం చూపారు.. బతికే విషయంలో తెగువ చూపలేక..) తమ్ముడు,మరదలు చనిపోవడంతో విలపిస్తున్న రాము అక్క లక్ష్మి సెల్‌ఫోన్ వల్లేనా? హేమదుర్గ పెళ్లికి ముందు పెద్దాపురంటౌన్‌లోని 8వ వార్డు వలంటీరుగా పనిచేసేది. వివాహానంతరం మానేసింది. విషయం తెలియని అక్కడి గ్రామస్తులు ఏదో ఒక సమస్య చెప్పేందుకు తరచూ ఫోన్లు చేసేవారు. విధులు మానేశాక కూడా ఫోన్లు రావడంతో సున్నిత మనస్కుడైన రాము సిమ్‌ను తీసేయాలని హేమకు సూచించాడు. ఇదే క్రమంలో ఈనెల 23న దంపతులిద్దరూ పెద్దాపురం వెళ్లినప్పుడు సెల్‌సిమ్ మార్చమని బావమరిది జగదీశ్వరరావుకు రాము చెప్పాడు. ఆయన వద్దే సెల్ వదిలి వీరిద్దరూ ఈ నెల 27న తిరిగి చీపురువలస చేరుకున్నారు. ఎప్పటిలాగే కలసిమెలసి ఉన్న హేమదుర్గ భర్తను విధులకు సాగనంపి ఆత్మహత్యకు పాల్పడింది. చెల్లి ద్వారా విషయం తెలుసుకున్న రాము మనస్థాపానికి గురయ్యాడు. తను కూడా చనిపోతానంటూ స్నేహితులకు ఫోన్లో తెలిపి స్విచ్ఆఫ్ చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆయన కోసం రెండుగంటల పాటు వెతికారు. చివరకు ఉదయం 11 గంటల సమయంలో చీపురువలస గ్రామ సరిహద్దుల్లో ఉన్న దాట్లాహోం వద్ద కాగుచెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న సీఐ బాలసూర్యారావు, ఎస్సై జనార్దన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాలను పరిశీలించారు. తహసీల్దార్ రమణారావు, సర్పంచ్ మచ్చ ఎర్రయ్యస్వామి, గ్రామపెద్దల సమక్షంలో ఇద్దరి మృతదేహాలకు శవ పంచనామా చేసి పోస్టుమార్టం కోసం ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. హేమదుర్గ సోద రుడు జగదీశ్వరరావు (పెద్దాపురం) సెల్‌ఫోన్ విషయమై గొడవలు పడుతున్నారని ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. -
విషాదం: పెళ్లి విషయంలో ధైర్యం చూపారు.. బతికే విషయంలో తెగువ చూపలేక..
సాక్షి, రేగిడి (శ్రీకాకుళం): ఇద్దరూ బాగా చదువుకున్న వాళ్లు. మంచి చెడులు ఆలోచించగల విచక్షణ ఉన్నవారు. కష్టాలు కలకాలం ఉండవనే నిజం తెలిసిన వారే. అయినా క్షణికావేశానికి గురయ్యారు. పెళ్లి విషయంలో ధైర్యం చూపిన ఈ దంపతులు.. బతికే విషయంలో మాత్రం తెగువ చూపలేకపోయారు. రేగిడి మండలంలోని తునివాడకు చెందిన నవ దంపతులు పల్లి హరీష్(29), రుంకు దివ్య(20) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ బలవన్మరణం వెనుక కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎస్ఐ షేక్ మహమ్మద్ ఆలీ తెలిపిన వివరాల ప్రకారం.. చదవండి: (పుట్టినింటికి వచ్చిన చెల్లెని హతమార్చి.. పోలీస్‌స్టేషన్‌లో లొంగుబాటు) వివరాలు సేకరిస్తున్న ఎస్.ఐ షేక్ మహమ్మద్ ఆలీ మండలంలోని తునివాడ గ్రామానికి చెందిన పల్లి హరీష్ ఎంసీఏ చదివాడు. అదే గ్రామానికి చెందిన రుంకు దివ్య డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. ఒకే గ్రామం, ఒకే సా మాజిక వర్గానికి చెందిన వీరి మధ్య కొన్నేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1న వీరు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో స్నేహి తుల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విశాఖలో కొత్త కాపురం పెట్టారు. ఇద్దరూ ఉద్యోగాల వేటలో పడ్డారు. రెండు రోజుల కిందటే ఊరికి వచ్చిన ఈ దంపతులు అబ్బాయి ఇంటిలో ఉన్నారు. బుధవారం ఏమైందో గానీ ఇద్దరూ ఇంటిలో ఉన్న ఫ్యానుకు ఉరి వేసుకుని విగతజీవులయ్యారు. కేసు నమోదు విషయం తెలిసిన వెంటనే సీఐ జి.శంకరరావు, ఎస్ఐ షేక్ మహమ్మద్ ఆలీ తునివాడ గ్రామానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని, ఇంటిని పరిశీలించా రు. వీరితో పాటు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. అనంతరం శవ పంచనామా చేసి రాజాం సామాజిక ఆస్పత్రికి పోస్టుమార్టంకు తరలించారు. చదవండి: (కర్కోటక తండ్రి.. కుమారుని గృహ నిర్బంధం) -
టిక్‌టాక్ దంపతుల ఆత్మహత్య!
సాక్షి, గుంటూరు : బెల్లంకొండలో శుక్రవారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మనస్తాపంతో నవ దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పవన్, శైలజ టిక్‌టాక్ ద్వారా పరిచయమయ్యారు. నెల క్రితమే వారు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. శైలజది చిత్తూరు కాగా, పవన్ స్వస్థలం మంగళగిరి. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో శైలజ తల్లిదండ్రులు పవన్‌పై కేసు నమోదు చేశారు. దీంతో మనస్తాపం చెందిన నవదంపతులు ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగ దంపతుల ఆత్మహత్య -
విషాదం : నవ దంపతుల ఆత్మహత్య
సాక్షి, భువనగిరి : నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగి అఘాయిత్యానికి ఒడిగట్టడంతో అక్కడికక్కడే భర్త మృతిచెందగా భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణా లు విడిచింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట్ల అంజయ్య–మంగమ్మలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు ఆలకుంట్ల స్వామి(24) ప్రస్తుతం ఘట్కేసర్ మండలం అనోజీగూడలో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన శివరాత్రి ఉమారాణి తన కుటుంబ సభ్యులతో కలిసి పటాన్‌చెరువులో ఉంటుంది. స్వామి, ఉమారాణి ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 16న ఇద్దరు కలిసి ఇంటినుంచి వెళ్లి పోయారు. బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామంలో ఉన్న ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించాలని అదే రోజు ఘట్కేసర్లోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు విన్నవించారు. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. సోమవారం రాత్రి భువనగిరి పట్టణ శివారులో ఉన్న డాల్ఫిన్ హోట ల్కు వచ్చి ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. మంగళవారం ఉదయం గది నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది తలుపులు తీసుకొని లోపలికి వెళ్లి చూడగా ఇద్దరు పురుగులు మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే 108కి, పోలీస్‌లకు సమాచారం అందజేశారు. ఇద్దరిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే స్వామి మృతిచెందాడు. ఉమారాణి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. విషయం తెలుసుకున్న బంధువులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పట్టణ పోలీసులు తెలిపారు. -
పెళ్లైన పది రోజులకే యువజంట బలవన్మరణం..!!
సాక్షి, మేడ్చల్ : ఇటీవలే వివాహం చేసుకున్న నూతన వధూవరులు ఆత్మహత్యకు పాల్పడడంతో ఓల్డ్ అల్వాల్‌లోని చిన్నన్నతోటలో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం ఉదయం వెలుగుచూసింది. వివరాలు.. ఓల్డ్ అల్వాల్‌కు చెందిన మున్నా మల్లేష్ (26) దంపతులు ప్రేమించుకుని 10 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అన్నోజి గూడ వద్ద గల రాజీవ్ గృహకల్పలోని బ్లాక్ నెంబర్ 78లో నివాసముంటున్నారు. పెళ్లి చేసుకున్న అనంతరం రాజీవ్ గృహకల్పలో నివాసముండేందుకు ఇటీవల వచ్చివెళ్లారని, మూడు రోజుల క్రితం వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నవదంపతుల ఆత్మహత్య
సాక్షి, కృష్ణా జిల్లా : వివామైన 3 నెలలకే నవదంపతులు ఆతహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని ముసునూరు మండలం కాట్రేనిపాడులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మేసుపాము శివరామకృష్ణ (32), భార్య నాగమల్లేశ్వరి (24)లు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న ముసునూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది -
నవ దంపతుల ఆత్మహత్య
కుషాయిగూడ: కుటుంబ కలహాల కారణంగా నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... ఉత్తరాఖండ్, డెహ్రడూన్‌కు చెందిన దివాకర్‌కుమార్ (29) ఎన్ఎఫ్సీలో టెక్నీషీయన్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి గత ఫిబ్రవరిలో అదే రాష్ట్రానికి చెందిన హిమానీదేవి (27)తో వివాహం జరిగింది. కొన్ని నెలలు వారి కాపురం సజావుగా సాగినా..ఇటీవల మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో భార్యభర్తలు తరచూ గొడవ పడేవారు. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు ఇటీవల వారికి సర్థిచెప్పారు. అయినా వారిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో గత ఆదివారం కూడా వారి మధ్య ఘర్షణ జరిగినట్లు స్థానికులు తెలిపారు. తరువాత ఏం జరిగిందో గాని ఇంట్లోని సీలింగ్‌ఫ్యాన్‌కు దంపతులిద్దరూ ఒకే చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం ఉదయం ఇంటి కిటీకిలోంచి గమనించిన ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకటరమణ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశామని, వారిని విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.