
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ శివరామయ్య
దామెర: వారికి నెల రోజుల కింద పెళ్లయింది. మొదట బాగానే ఉన్న అమ్మాయి.. కొద్దిరోజులకు అసలు విషయం బయటపెట్టింది.. తన కు ఇష్టంలేని పెళ్లి చేశారని భర్తతో చెప్పింది.. మెల్లగా సర్దుకుంటుందిలే అని భర్త అనుకున్నాడు.. కానీ ఓ అర్ధరాత్రి.. బాత్రూమ్‌కని లేచిన అమ్మాయి.. మెల్లగా బ్లేడ్ తీసుకుని వచ్చింది.. బెడ్‌పై పడుకుని ఉన్న భర్త మెడ కోసేందుకు యత్నించింది.. అది గమనించిన భర్త గట్టిగా అరవడంతో కుటుంబ సభ్యులు వచ్చి ఆస్పత్రికి తరలించారు. హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండలో సోమవారం ఈ ఘటన జరిగింది. పరకాల పోలీ సులు,బాధితుడు ఈ వివరాలు వెల్లడించారు.
ఇష్టం లేదని చెప్పి..
పసరగొండకు చెందిన మాడిశెట్టి రాజు గ్రామ సమీపంలోని ఒక క్రషర్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఆత్మకూర్ మండలం మల్లక్కపేట గ్రామానికి చెందిన హేమలత అలియాస్ అర్చనతో మార్చి 25న పెళ్లి జరిగింది. కొద్దిరోజుల క్రితం తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని భర్త రాజుతో చెప్పింది. రాజు అంటే ఇష్టం లేదంది. అయినా రాజు ఏమీ అనలేదు. తనంటే ఇష్టం కలిగే ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు.
ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో అర్చన బాత్రూమ్‌కని లేచి అటుఇటు తిరిగి నిద్రపోయింది. తర్వాత 2 గంటల సమయంలో మళ్లీ లేచింది. వెళ్లి బ్లేడ్ తీసుకొని వచ్చి రాజు గొంతు కోసేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో రాజు ఓ పక్కకు తిరిగి పడుకోవడంతో అతడి మెడపై గాయమైంది. ఆమె మరోసారి బ్లేడుతో కోసేందుకు సిద్ధమయ్యేసరికి రాజు తేరుకున్నాడు.
అర్చనను నెట్టివేసి గట్టిగా అరిచాడు. కుటుం బ సభ్యులు పరుగెత్తుకువచ్చి రాజును రక్షిం చారు. మెడపై గాయంతో రక్తం కారుతున్న రాజును.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు రాజుకు చికిత్స చేశారు. మెడ వెనుకవైపున గాయమవడం వల్ల ప్రాణాపాయం తప్పిందని చెప్పి ఇంటికి పంపించారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కేసు పూర్తి వివరాలను తర్వాత ప్రకటిస్తామని ఏసీపీ జూపల్లి శివరామయ్య తెలిపారు.
సర్దుకుంటుందని అనుకున్నా..
‘నెల క్రితం మా పెళ్లయింది. ఈ మధ్యే తనకు నేనంటే ఇష్టం లేదని చెప్పింది. పెళ్లయి కొన్నిరోజులే కదా అయింది. నెమ్మదిగా సర్దుకుంటుందని అనుకున్నా.. రాత్రి పడుకున్న తర్వాత లేచింది. బాత్రూమ్‌కు వెళ్తుందనుకున్నా.. కానీ బ్లేడు తెచ్చి గొంతుకోయాలని చూసింది. నేను గట్టిగా అరిచే సరికి పక్క గదిలోకి వెళ్లి దాక్కుంది’ అని రాజు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment