పద్మ (ఫైల్)
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: నగరంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. నగర శివారులోని టమాట మండీ వద్ద ఉన్న బీజేపీ కొట్టాలలో నివాసముంటున్న సునీత, కేశప్ప దంపతుల కుమార్తె పద్మ(23).. కిమ్స్ సవీరా ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. సోమవారం రాత్రి విధులకు హాజరైన ఆమె మంగళవారం వేకువ జాము 2.22 గంటలకు ఎమర్జెన్సీ గదిలోని ఓ బెడ్‌పై నిద్రించింది.
తెల్లవారుజాము 4.45 గంటలకు ఆమెను నిద్రలేపేందుకు తోటి ఉద్యోగి వెళ్లింది. ఆ సమయంలో అచేతనంగా పడి ఉన్న పద్మను గమనించి.. విషయాన్ని వెంటనే ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. అప్రమత్తమైన వైద్యులు.. పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆస్పత్రికి వద్దకు చేరుకుని కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.
ఎంతో ఆరోగ్యంగా ఉండే తమ బిడ్డ మృతి చెందిందంటే నమ్మశక్యంగా లేదని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు తెలిపారు. కాగా, విషయం తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేతలు సాకే హరి, తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకుని పద్మ మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె మృతికి కారకులెవరో తెలపాలంటూ ఆస్పత్రి వర్గాలను డిమాండ్ చేశారు.
చదవండి: భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
రెండు రోజుల క్రితం చిన్నారికి వైద్యం అందించే అంశంపై పద్మను యాజమాన్యం భయభ్రాంతులకు గురి చేసిందని, తప్పు లేకపోయినా లిఖిత పూర్వకంగా సంజాయిషీ తీసుకున్నారని మండిపడ్డారు. మరుసటి రోజు కూడా ఆమెను డైరెక్టర్ల సమావేశానికి రప్పించుకుని రాత్రి 9 గంటల వరకూ నిల్చోబెట్టి అవమానించారని మండిపడ్డారు. పద్మ మృతిపై లోతైన దర్యాప్తు చేపట్టి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment