సాక్షి, విశాఖపట్నం: దళిత యువకుడు పర్రి శ్రీకాంత్ శిరోముండనం కేసులో అరెస్టైన నూతన్ నాయుడిని పోలీసులు ఉడిపి నుంచి విశాఖకు తరలిస్తున్నారు. ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరిట పైరవీలు చేసిన విషయంపై కూడా లోతుగా విచారణ చేపట్టనున్నారు. కాగా శిరోముండనం కేసులో నూతన్‌నాయుడు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంఘటన జరగడానికి ముందు తర్వాత కూడా అతను నెట్ కాల్‌తో భార్య మధుప్రియతో మాట్లాడినట్టు విచారణలో వెల్లడైంది. దీంతో పరారీలో ఉన్న నూతన్ నాయుడును కర్ణాటకలోని ఉడిపి రైల్వేస్టేషన్‌లో గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా దళిత యువకుడి పట్ల అమానుషంగా వ్యవహరించిన అతడిపై ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గతంలోనూ నూతన్ నాయుడు అనేక అక్రమాలకు పాల్పడ్డాడని, కాబట్టి అతడిపై రౌడీషీట్ తెరవాల్సిందిగా ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.(చదవండి: సీసీటీవీ ఫుటేజ్‌లో గుండు చేసిన దృశ్యాలు )
తప్పు చేసింది ఎవరైనా శిక్ష తప్పదు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సొంతపార్టీ కార్యకర్తలు తప్పు చేసినా శిక్ష తప్పదని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ అన్నారు. నూతన్ నాయుడు అరెస్ట్ తప్పదని తాము ముందే చెప్పామని, పోలీసులు చట్టపరమైన సాక్ష్యాలు సేకరించిన తర్వాతే అరెస్టు చేశారన్నారు. అతడి అక్రమాలపై లోతుగా విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.
అలా అసలు విషయం బయటపడింది..
శిరోముండనం కేసులో నూతన్ భార్యతో పాటు ఏడుగురు నిందితులను ఆగస్టు 29న పోలీసుల అరెస్టు చేశారు. అయితే అప్పటికే పరారైన నూతన్ నాయుడు.. భార్యను తప్పించేందుకు పథకం రచించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్‌కి ఫోన్ చేసి తాను మాజీ ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్‌నని ప్రియా మాధురి (నూతన్ భార్య)కి రెండు వారాలపాటు ఆస్పత్రిలో వైద్యం అందించాల్సి ఉందంటూ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే కేజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్‌కి పి.వి.రమేష్ పరిచయం ఉండడంతో అనుమానం వచ్చి ఆయనకు ఫోన్ చేసి మీ పేరుతో ఎవరో ఫోన్ చేస్తున్నారని చెప్పారు. దీంతో పి.వి. రమేష్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ నంబర్‌ని ట్రేస్ చేయగా.. అసలు విషయం బయటపడింది. ఈ క్రమంలో ముంబై వెళుతున్న నూతన్ నాయుడు ఉడిపి రైల్వేస్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment