బావిలోకి దిగి మృత్యువాత పడిన హేమరాజ్, అనూప్
జయపురం: బావి శుభ్రం చేసే క్రమంలో ఊపిరాడక ఇద్దరు కూలీలు దుర్మరణం చెందగా.. మరో వ్యక్తి అస్వస్థతలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నవరంగపూర్ జిల్లా రాయిఘర్ సమితి హటబరండి పంచాయతీ సోనారపార గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు సోనారపారకు చెందిన రాజు కెవుట తన బావిని శుభ్రం చేసేందుకు గ్రామానికి చెందిన హేమరాజు హలదను పిలిచాడు. హేమారాజ్ నూతిలో దిగి పని ప్రారంభించాడు. కొంత సమయం తర్వాత బావిలో నుంచి ఎటువంటి శబ్ధం రాకపోవడంతో హేమరాజ్‌కు ఏమైందో అని ఆందోళనతో అతన్ని కాపాడేందుకు రాజు కెవుట బావిలో దిగాడు. అతడు కూడా బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. వారిని కాపాడేందుకు అనూప్ కెవుట అనే మరో వ్యక్తి బావిలో దిగాడు.
బావిలో శ్వాస ఆడక ముగ్గురూ సృహతప్పి పడిపోయారు. స్థానికులు కుందైయ్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు, రాయిఘర్ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ముగ్గురినీ బయటకు తీశారు. అయితే అప్పటికే హేమరాజ్, అనూప్ మృతి చెందగా, రాజు కెవుట ఆపస్మారక స్థితిలో ఉన్నాడు. అతడిని వెంటనే హటబరండి పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. కుందైయ్ పోలీస్ స్టేషన్ అధికారి ఫకీర్‌మోహన ఖొర కేసు నమోదు చేసి మృతదేహాను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాయిఘర్ అదనపు తహసీల్దార్ జగు పూజారి, కుంధ్ర బీడీఓ దేవేంద్ర ప్రసాద్ ధల్ సంఘటనా ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రాజు కెవుట ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.
చదవండి: కూతురి ప్రేమపెళ్లి.. పరువు కోసం తల్లిదండ్రులు
Comments
Please login to add a commentAdd a comment