నెల్లూరు నుంచి మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నం
చెన్నై మీంజూరు రైల్వేస్టేషన్‌లో పట్టుబడిన తండ్రి, కూతురు
నిందితులను అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు
నెల్లూరు (క్రైమ్)/తిరువళ్లూరు: పరిచయస్తురాలిని హత్యచేసి.. మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి.. పక్కరాష్ట్రంలో పడేసేందుకు ప్రయత్నించిన ఘటన సంచలనం కలిగించింది. నెల్లూరులో వృద్ధురాలిని హత్యచేసి మృతదేహాన్ని తమిళనాడులో పడేసేందుకు ప్రయత్నించారు. ఈ దుర్మార్గానికి సంబంధించి తండ్రీకుమార్తెలను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు రాజేంద్రనగర్‌లో ఎం.రమణి (65), మురుగేశం దంపతులు ఉంటున్నారు. వీరికి నలుగురు పిల్లలు. రమణి సోమవారం కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లి ఎంతకీ తిరిగిరాకపోవడంతో గాలించిన కుటుంబసభ్యులు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు.
మీంజూరు రైల్వేస్టేషన్‌లో మృతదేహం
సంతపేట ఇన్స్పెక్టర్ మద్ది శ్రీనివాసరావు, ఎస్‌ఐ బాలకృష్ణ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి సాంకేతికత ఆధారంగా గాలింపు చేపట్టారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సీసీ ఫుటేజ్‌లు పరిశీలించారు.
ఆ సమయంలో తమిళనాడులోని మీంజూరు రైల్వే పోలీసులు సంతపేట ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్‌చేసి సూట్ కేసులో వృద్ధురాలి మృతదేహం ఉందని, ఆ సూట్ కేసును తీసుకొచ్చిన రాజేంద్రనగర్‌కు చెందిన బాలసుబ్రహ్మణ్యం, అతని కుమార్తె తమ అదుపులో ఉన్నారని చెప్పారు. మృతదేహం ఫొటోను పంపించారు. మృతదేహం రమణిదిగా గుర్తించిన ఇక్కడి పోలీసులు రైల్వేపోలీసులకు సమాచారమిచ్చారు. మీంజూరు రైల్వేపోలీసుల విచారణలో రమణిని హత్యచేసినట్లు చెప్పారు.
బంగారు ఆభరణాల కోసమే..
గతంలో రమణి ఇంటికి సమీపంలో ఉన్న బాలసుబ్రహ్మణ్యం కుటుంబం ఇటీవల అదేప్రాంతంలో అపార్ట్‌మెంట్‌కు వెళ్లిపోయింది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో రమణి ఒంటిపై ఆభరణాలు కాజేయాలని నిర్ణయించుకుని ఆమె కదలికలపై నిఘా ఉంచాడు. సోమవారం కూరగాయల కోసం వచ్చిన ఆమెతో మాట కలిపి తమ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను హత్యచేసి ఒంటిపై ఉన్న సరుడు, నల్లపూసలదండ, కమ్మలు దోచుకున్నాడు.
రమణి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి ట్రావెల్ సూట్‌కేస్‌లో కుక్కాడు. మృతదేహాన్ని నెల్లూరు జిల్లాలో ఎక్కడైనా పడేస్తే తెలిసిపోతుందని.. పొరుగునున్న తమిళనాడులో పడేయాలని నిర్ణయించుకుని కుమార్తెకు చెప్పాడు. సాయంత్రం సుబ్రహ్మణ్యం, కుమార్తెతో కలిసి నెల్లూరు సౌత్ రైల్వేస్టేషన్‌లో చెన్నై వెళ్లే ప్యాసింజర్ రైలు ఎక్కారు.
చెన్నై మీంజూరు స్టేషన్‌లో రైలు ఆగడంతో.. దిగి నెల్లూరు వెళ్లే రైలెక్కి మార్గంమధ్యలో సూట్‌కేస్‌ను బయట పడేయాలనుకున్నారు. రైలు కోసం వేచి ఉన్న సమయంలో అక్కడి రైల్వే పోలీసులు విజిల్ వేయడంతో కంగారుపడి వెళుతుండగా ప్లాట్‌ఫాంపై ఉన్న ఓ యువకుడు సూట్‌కేస్‌ను మరిచిపోయారంటూ కేకలు వేశాడు. రైల్వే పోలీసులు వారిని ఆపి సూట్‌కేస్ గురించి ప్రశ్నించగా నీళ్లునమలడం, భయపడడంతో వారికి అనుమానం వచ్చింది.
సూట్‌కేస్ నుంచి రక్తం కారుతుండడంతో తెరచి చూశారు. మృతదేహం బయటపడింది. దీంతో వారిని రైల్వే పోలీసులు విచారించగా బంగారు ఆభరణాల కోసమే హత్యచేసినట్లు చెప్పారు. కాగా, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. çహత్య జరిగిన ప్రాంతం నెల్లూరు కావడంతో త్వరలోనే కేసును ట్రాన్స్‌ఫర్ చేస్తామని అక్కడి పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment