
తిరువళ్లూరు: విద్యార్థినికి మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన అన్న (పెద్దమ్మ కుమారుడు)ను తిరువళ్లూరు మహిళ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. ఆరణి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని ప్లస్‌టూ చదువుతోంది. అయితే పాఠశాలకు వెళ్లి రావడానికి బస్సు సదుపాయం లేకపోవడంతో తిరువళ్లూరు సమీపంలోని రామతండలం గ్రామంలోని పెద్దమ్మ కర్పగం వద్ద ఉంటూ చదువుకుంటోంది.
అయితే, ఇంట్లో ఎవరూ లేని సమయంలో కర్పగం కుమారుడు నాగరాజ్ వరసకు చెల్లెలు అయ్యే విద్యార్థినికి మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల విద్యార్థిని అనారోగ్యానికి గురికావడంలో అనుమానించిన తల్లిదండ్రులు ఆమెను సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఆమె గర్భం దాల్చినట్టు నిర్ధారించారు. దీంతో, బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు తిరువళ్లూరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక గర్భం దాల్చడానికి ఆమె పెద్దమ్మ కొడుకు నాగరాజ్ కారణ అని తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్టు చేశారు. కాగా ఇది వరకే నాగరాజ్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉండడం గమనార్హం.
అత్యాచారానికి పాల్పడిన మైనర్‌కు వినూత్న శిక్ష
మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో మైనర్ బాలుడికి తిరువళ్లూరు కోర్టు న్యాయమూర్తి రాధిక వినూత్న శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడు, అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. బాలిక తల్లి 2021లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసు విచారణ తిరువళ్లూరులోని జువైనల్ కేసులను విచారించే ప్రత్యేక కోర్టులో సాగింది. విచారణలో నిందితుడి నేరం ఒప్పుకోవడంతో న్యాయ మూర్తి రాధిక తీర్పును వెలువరించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతో ఏడాది పాటు పళ్లిపట్టు ప్రభుత్వ వైద్యశాలలో పారిశుద్ధ్య పనులను చేపట్టాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment