వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. సరదాగా అంతా కలిసి ఓ చోట చేరి పార్టీ చేసుకుంటున్న సమయంలో తలెత్తిన వివాదం యువకుడి ప్రాణం బలిగొంది. మరో ఇరవై మంది గాయపడ్డారు. ఈ ఘటన వాషింగ్టన్ డీసీలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ విషయం గురించి మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్టుమెంట్ చీఫ్ పీటర్ నీషం మాట్లాడుతూ.. వందలాది మంది ఒక్కచోట చేరి అవుట్‌డోర్ పార్టీ చేసుకున్నట్లు తెలిపారు. ఫుడ్ లాగిస్తూ.. మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వివాదం చెలరేగిందని.. ఈ క్రమంలో కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. (ట్రంప్ నిర్ణయం; 293 మంది అమెరికన్ల మృతి)
ఈ ఘటనలో ఓ పోలీస్ ఆఫీసర్(ఆ సమయంలో విధుల్లో లేరు)కూడా తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకైతే ఎవరినీ అరెస్టు చేయలేదని, దుండగులు కాల్పులకు తెగబడటానికి కారణం ఇంతవరకు తెలియరాలేదన్నారు. కోవిడ్-19 నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ వందలాది మంది ఒక్కచోట చేరి వీకెండ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారని, ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఇక ప్రత్యక్ష సాక్షులు ఈ విషయం గురించి చెబుతూ.. బర్త్‌డే పార్టీలో ఒక్కసారిగా గన్‌ఫైరింగ్ శబ్దాలు వినిపించాయని, అప్పటివరకు సరదాగా గడుపుతున్న వారంతా ఒక్కసారిగా రోడ్ల మీద పడిపోయారని పేర్కొన్నారు. మరికొంత మంది కార్ల కింద దాక్కొన్నారని, అదో భయంకర ఘటన అని గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment