
కొలిమిగుండ్ల: బంధువుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం అబ్దులాపురంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కొలిమిగుండ్ల ఎస్‌ఐ హరినాథరెడ్డి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. అబ్దులాపురానికి చెందిన షేక్ కాశీం (38), వలి బంధువులు. ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. ఇరు కుటుంబాల మధ్య కొద్ది రోజుల నుంచి విభేదాలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతుండేవారు.
ఆదివారం రాత్రి వలి భార్య లక్ష్మీదేవి ఇంటి ముందు నీళ్లు చల్లింది. అవి తమ ఇంటి ముందు వరకు పడ్డాయనే కోపంతో కాశీం కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. ఈ గొడవ తీవ్రమై దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఆవేశానికి లోనైన వలి చలిక పారతో కాశీంతో పాటు అతని తల్లి మాబున్నీ, భార్య రమీజాపై దాడి చేశాడు. ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం బంధువులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి విషమించి కాశీం మృతి చెందాడు. ఎస్‌ఐ గ్రామానికి చేరుకుని ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. కాశీం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
( చదవండి: బాలికను నిర్బంధించి 4 లక్షల సొత్తు చోరీ )
Comments
Please login to add a commentAdd a comment