నెల్లూరు(క్రైమ్): నాటు సారారహిత గ్రామాలే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్–2 జిల్లాలో విజయవంతమైంది. ప్రభుత్వ ఆదేశాలతో ఏప్రిల్ 15వ తేదీ నుంచి రెండునెలలపాటు ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో సెబ్ జేడీ కె.శ్రీలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా సారా తయారీ, విక్రయ, అక్రమరవాణా అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించారు. పక్కా ప్రణాళికతో ఆయా ప్రాంతాల్లో సెబ్, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు చేసి నాటు సారాను స్వాధీనం చేసుకోవడంతోపాటు బెల్లపు ఊటను ధ్వంసం చేశారు.
మరోవైపు కార్డన్ సెర్చ్‌లు చేశారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నాటుసారా నిర్మూలనతోపాటు వ్యాపారుల్లో మార్పు తీసుకొచ్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహించారు. సారాకు బానిసలు కావొద్దని యువతకు సూచించారు. తమ ప్రాంతాల్లో సారా తయారీకి ఒప్పుకోమని గ్రామస్తులతో ప్రమాణాలు చేయించారు. సారా వ్యాపారం మానుకున్న వారికి ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపిస్తామని ఇచ్చిన హామీలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
81 కేసులు
ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఇప్పటివరకు 81 కేసులు నమోదు చేసి 79 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 238 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని 23 వేల లీటర్ల బెల్లపుఊటను ధ్వంసం చేశారు. 75 కేజీల బెల్లం, రెండు వాహనాలను సీజ్ చేశారు. కొందరు సారా తయారీదారులకు బెల్లం సరఫరా చేసిన ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేశారు.
వారిపై పీడీ యాక్ట్
తొలిసారిగా ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. పదేపదే నేరాలకు పాల్పడుతున్న బోగోలు మండలం కప్పరాళ్లతిప్పకు చెందిన సముద్రాల దుర్గారావు, మేకల హరీష్‌పై పీడీ యాక్ట్ పెట్టి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. అధికారుల చర్యలతో అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలైంది.
ఉక్కుపాదం మోపాం
ఆపరేషన్ పరివర్తన్–2లో భాగంగా సారా తయారీ, విక్రయాలపై రెండునెలలపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. నిందితులపై కేసులు నమోదుచేయడంతోపాటు తొలిసారిగా ఇద్దరిపై పీడీ యాక్ట్‌లు నమోదు చేశాం. ఆత్మకూరు ఉప ఎన్నిక పూర్తయింతే వరకు దాడులు కొనసాగుతూనే ఉంటాయి. మత్తు పదార్థాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెంచాం. ఈ తరహా నేరాలు జరుగుతన్నట్లు ప్రజలు గుర్తిస్తే డయల్ 100 లేదా స్థానిక పోలీసులు, సెబ్ «అధికారులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటాం.
– శ్రీలక్ష్మి, సెబ్ జేడీ
Comments
Please login to add a commentAdd a comment