నారాయణ నాటకాలు! | P Narayana Drama For Bail In Tenth class question paper leak case | Sakshi
Sakshi News home page

నారాయణ నాటకాలు!

Published Thu, May 12 2022 5:02 AM | Last Updated on Thu, May 12 2022 5:37 AM

P Narayana Drama For Bail In Tenth class question paper leak case - Sakshi

తమ చైర్మన్‌ పి. నారాయణ అని తెలుపుతూ ఈటీవీ ఇంటర్వ్యూను పోస్టు చేసిన నారాయణ గ్రూప్‌

సాక్షి, అమరావతి:  టీడీపీ అధినేత చంద్రబాబు  రెండు కళ్ల సిద్ధాంతం, రెండు నాలుకల ధోరణిని నారాయణ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి పి.నారాయణ కూడా పుణికిపుచ్చుకున్నారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీక్‌ కేసులో ప్రధాన నిందితుడైన నారాయణ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించి తప్పుడు సమాచారం, బోగస్‌ డాక్యుమెంట్లను సమర్పించి బెయిల్‌ పొందినట్లు స్పష్టమవుతోంది. నారాయణ విద్యాసంస్థలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, 2014లోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తాజాగా మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలమిచ్చిన నారాయణ.. దాదాపు రెండు నెలల క్రితం ఈటీవీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం మూడేళ్లుగా తానే నారాయణ విద్యాసంస్థలను పర్యవేక్షిస్తున్నట్లు  వెల్లడించడం గమనార్హం.

ఇంటర్వూ చేస్తున్న యాంకర్‌ కూడా స్వయంగా నారాయణ విద్యా సంస్థల చైర్మన్‌ అంటూ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ మేరకు నారాయణ ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీనిబట్టి ఇప్పటికీ ఆయనే నారాయణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లు తేలిపోతోంది. ఇదే విషయాలను చంద్రబాబుకు సైతం చెప్పానంటూ అందులో నారాయణ పేర్కొనడం గమనార్హం. నారాయణ వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకునే మేజిస్ట్రేట్‌ ఆయనకు బెయిల్‌ మంజూరు చేశారు.

వాట్సాప్‌లో ప్రశ్నపత్రం లీక్‌ కావడం, ఆధారాలతో సహా నారాయణ విద్యాసంస్థల డీన్, ప్రిన్సిపాల్‌ దొరకడం, నేరాన్ని అంగీకరిస్తూ నారాయణ ఆదేశాలతోనే ఇదంతా చేసినట్లు వారు వెల్లడించడం, ఆ తర్వాతే పోలీసులు నారాయణను అరెస్టు చేయడం తెలిసిందే. తమ విద్యాసంస్థకు సంబంధించి ఏ నిర్ణయమైనా పైస్థాయిలో నారాయణే స్వయంగా తీసుకుంటున్నారని ఉద్యోగులు కూడా వెల్లడించారు. సంస్థ వ్యవహారాల్లో ఆయన ఇంత చురుగ్గా పాలు పంచుకుంటున్నట్లు స్పష్టం అవుతుండగా తప్పుడు సమాచారం ఇచ్చి బెయిల్‌ పొందడంపై న్యాయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.


రెండు దశాబ్దాలకుపైగా టీడీపీతో.. 
2000 సంవత్సరం నుంచి తాను టీడీపీతో సంబంధాలు కొనసాగించానని,  రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో చంద్రబాబు తనకు ఉత్తరాంధ్ర జిల్లాల ఎన్నికల బాధ్యతను అప్పగించడమే కాకుండా గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇచ్చినట్లు పేర్కొన్నారు. మంత్రి పదవిని చేపడుతుండటంతో 2014లో నారాయణ ఫౌండర్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేసినా ఆ విద్యా సంస్థలతో సంబంధం కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. తాను మున్సిపల్‌ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని 2,000 మునిసిపల్‌ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడమే కాకుండా నారాయణ టెక్నో స్కూల్స్‌ సిలబస్‌ను ప్రవేశపెట్టానన్నారు.  పదో తరగతిలో 11 మంది మున్సిపల్‌ స్కూల్స్‌ విద్యార్థులు పదికి పది పాయింట్లు సాధించగా, నారాయణ స్కూళ్లలో 2,000 మంది పదికి పది పాయింట్లు తెచ్చుకున్నారని నారాయణ చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement